BANvsENG T20I: ఇంగ్లాండ్ కు ఇటీవలే ముగిసిన మూడో వన్డేలో షాకిచ్చిన బంగ్లాదేశ్  తాజాగా టీ20 సిరీస్ లో కూడా అదే పని చేసింది.  ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న జట్టుకు  వరుస ఓటములను రుచి చూపిస్తున్నది. 

గతేడాది భారత్ కు వన్డే సిరీస్ లో షాకులిచ్చి ఏకంగా సిరీస్ పట్టేసిన బంగ్లాదేశ్ తాజాగా అదే జోరును గతేడాది టీ20 ప్రపంచకప్ విజేతలు ఇంగ్లాండ్ మీద కూడా చూపిస్తుంది. స్వదేశంలో ఇంగ్లాండ్ కు షాకులు మీద షాకులిస్తున్నది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో గెలిచినంత పని చేసినా ఓడిన ఆ జట్టు మూడో వన్డేలో గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా నేటి నుంచి మొదలైన టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. 

చత్తోగ్రమ్ వేదికగా జరిగిన తొలి టీ20లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఇంగ్లాండ్ కు బౌలింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ కు వచ్చిన బట్లర్ గ్యాంగ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులే చేయగలిగింది.

ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (38), జోస్ బట్లర్ (42 బంతుల్లో 67, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి వికెట్ కు 80 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత వచ్చిన వారిలో బెన్ డకెట్ (20) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. డేవిడ్ మలన్ (4), మోయిన్ అలీ (8), సామ్ కరన్ (6), క్రిస్ వోక్స్ (1) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్.. 156 పరుగులకే పరిమితమైంది. 

Scroll to load tweet…

అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. ఓపెనర్లు లిటన్ దాస్ (12), రోని తాలూక్దార్ (21) లు వెంటవెంటనే నిష్క్రమించినా నజ్ముల్ హోసేన్ శాంతో (30 బంతుల్లో 51, 8 ఫోర్లు), హృదయ్ (17 బంతుల్లో 24) లు రాణించారు. చివర్లో కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (24 బంతుల్లో 34 నాటౌట్, 6 ఫోర్లు), అఫిఫ్ హోసేన్ (15 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటమే గాక మరో 2 ఓవర్లు మిగిలుండగానే విజయాన్ని అందుకున్నారు.

Scroll to load tweet…