Afghanistan vs Pakistan: అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ మధ్య బుధవారం షార్జా వేదికగా ముగిసిన మ్యాచ్ లో ప్రత్యర్థి ఆటగాడిపై దురుసుగా వ్యవహరించిన పాక్ బ్యాటర్ అసిఫ్ అలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అఫ్గానిస్తాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ పై దురుసుగా ప్రవర్తించడమే గాక అతడిని బ్యాట్ తో కొట్టాలని చూసిన పాకిస్తాన్ బ్యాటర్ అసిఫ్ అలీపై అఫ్గానిస్తాన్ క్రికెట్ లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అఫ్గాన్ క్రికెట్ కే పరిమితం కాకుండా మొత్తం క్రికెట్ అభిమానులను సైతం కదిలించింది. అసిఫ్ అలీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.
పాకిస్తాన్ ఛేదనకు దిగి మ్యాచ్ ఆఖర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అఫ్గాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ బౌలింగ్ లో నాలుగో బంతికి అలీ సిక్సర్ బాదాడు. అయితే ఆ తర్వాత బంతికే అతడు భారీ షాట్ కు యత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. అలీ అవుటయ్యాక ఫరీద్ తో పాటు అఫ్గాన్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు.
అయితే ఫరీద్.. అలీకి కాస్త దగ్గరగా వెళ్లి వికెట్ తీసిన మూమెంట్ ను ఎంజాయ్ చేశాడు. కానీ అది అలీకి నచ్చలేదు. దీంతో వెంటనే అలీ.. ఫరీద్ దగ్గరికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఫరీద్ కూడా వెనక్కి తగ్గలేదు. అక్కడితో అలీ ఆగక తన చేతిలో ఉన్న బ్యాట్ తీసి ఫరీద్ ను కొట్టబోయాడు. ఫరీద్ కూడా ‘చూస్కుందాం రా..’ అన్నట్టుగానే ముందుకు కదిలాడు. కానీ అప్పటికే అప్గాన్ ఫీల్డర్లు అక్కడికి చేరి ఇద్దరినీ విడదీశారు. దీంతో గొడవ అక్కడికి ముగిసింది అనుకున్నారంతా.. కానీ ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరలయ్యాయి.
దీంతో ట్విటర్ లో పలువురు నెటిజన్లు అసిఫ్ అలీ వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు. పలువురు అఫ్గాన్ అభిమానులు అసిఫ్ ను ఏకంగా ‘తీవ్రవాది’అని పేర్కొన్నారు. ‘క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. అలీ వ్యవహరించినందుకు ఏ శిక్ష విధిస్తారు..? అసిఫ్ అలీ ప్రవర్తన ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. అతడు ఆటలోని వాతావరణాన్ని మొత్తం మార్చేశాడు..’ అని ఓ ట్విటర్ యూజర్ పేర్కొన్నాడు. అతడిని ఆసియా కప్ నుంచే గాక క్రికెట్ నుంచి నిషేధించాలని ట్విటర్ వేదికగా ఐసీసీని కోరుతున్నారు అఫ్గాన్ క్రికెట్ ఫ్యాన్స్.
ఇదే విషయమై అఫ్గాన్ కు చెందిన ఓ క్రికెట్ అభిమాని ట్విటర్ లో.. ‘నాపేరు హష్మత్ ఖాన్. నేను అఫ్గాని. పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ లో పాక్ ఆటగాళ్ల తీరు ఏమీ బాగోలేదు. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా ఐసీసీని కోరుతున్నాను. అసిఫ్ అలీ ఫరీద్ ను భయబ్రాంతులకు గురి చేశాడు. అంతేగాక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నా విన్నపం ఏంటంటే.. ఈ టెర్రరిస్టులను క్రికెట్ జట్టులోకి ఎంపిక చేయకండి..’ అని ఘాటుగా స్పందించాడు.
మరో యూజర్ స్పందిస్తూ.. ‘క్రికెట్ అనేది ఏమైనా ఉగ్రవాద ప్రేరేపిత ఆటనా..? అలా కాకుంటే ఈ తీవ్రవాదు (పాక్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ)లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అసిఫ్ అలీ మీద తక్షణమే నిషేధం విధించండి..’ అని పేర్కొన్నాడు. ఇక ఈ విషయంలో ట్విటర్ వేదికగా స్పందిస్తూ అఫ్గాన్ క్రికెట్ అభిమానులు, క్రికెటర్లపై వ్యాఖ్యలు చేసిన షోయభ్ అక్తర్ ను కూడా ఆ దేశ అభిమానులు వదలడం లేదు. ‘నీ నుంచి మేం నేర్చుకునేది ఏమీ లేదు.. నీ జట్టును చూసుకో ముందు..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
