కరాచీ టెస్టులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుత సెంచరీ... సారథిగా మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసి నాలుగో క్రికెటర్‌గా రికార్డు... ఆసక్తికరంగా మారిన ఆఖరి రోజు ఆట...
కరాచీలో పాకిస్తాన్‌ని చిత్తు చేసి, టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించాలని భావించిన ఆస్ట్రేలియాకి అడ్డుగా నిలిచాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్. రెండేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ నమోదు చేసిన బాబర్ ఆజమ్, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
ఇంతకుముందు శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్, ఇంగ్లాండ్ మహిళా టీమ్ కెప్టెన్ హేథర్ నైట్ మాత్రమే కెప్టెన్లుగా మూడు ఫార్మాట్లలో సెంచరీలు నమోదు చేశారు. వీరిలో హేథర్ నైట్ తర్వాత క్రికెట్‌లో యాక్టీవ్‌గా కొనసాగుతున్న రెండో సారథి బాబర్ ఆజమ్. భారత నయా సారథి రోహిత్ శర్మకు మూడు ఫార్మాట్లలో సెంచరీలు ఉన్నప్పటికీ, కెప్టెన్‌గా ఆ ఫీట్ సాధించలేకపోయాడు...
దిల్షాన్ ఇప్పటికే క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించగా, ఫాఫ్ డుప్లిసిస్‌కి సౌతాఫ్రికా జట్టులో చోటు కరువైంది. కరాచీ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 556 పరుగుల భారీ స్కోరు చేసింది. ఉస్మాన్ ఖవాజా 160 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 72, అలెక్స్ క్యారీ 93, నాథన్ లియాన్ 38, ప్యాట్ కమ్మిన్స్ 34 పరుగులు చేశారు...
ఆసీస్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బాబర్ ఆజమ్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా పాక్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగుల భారీ ఆధిక్యం దక్కినా, ఫాలోఆన్ ఆడించడానికి ఇష్టపడలేదు ఆస్ట్రేలియా...
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. డేవిడ్ వార్నర్ 7 పరుగులు చేసి నిరాశపరచగా లబుషేన్ 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఉస్మాన్ ఖవాజా రెండో ఇన్నింగ్స్‌లోనూ 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 506 పరుగుల టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్ మొదలెట్టిన పాక్, 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇమామ్ వుల్ హక్ 1 పరుగు చేసి, అజర్ ఆలీ 54 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు...
అబ్దుల్లా షఫీక్ 226 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 71 పరుగులు, బాబర్ ఆజమ్ 197 బంతుల్లో 12 ఫోర్లతో 102 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి 171 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరి రోజు విజయానికి పాకిస్తాన్ మరో 314 పరుగులు చేయాల్సి ఉండగా, ఆస్ట్రేలియా 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంటుంది. తొలి టెస్టులో పేలవ పిచ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కరాచీ టెస్టులో ఓడితే సొంత అభిమానుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఫేస్ చేయాల్సి ఉంటుంది...
ఈ ఇద్దరూ వికెట్ పడకుండా ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారు? ఆ తర్వాత వచ్చే రిజ్వాన్, ఫవాద్ ఆలం వంటి సీనియర్లు ఏ మేరకు రాణిస్తారనేదానిపైనే మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది.
