2023లో మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన డివాన్ కాన్వే... రనౌట్‌తో కొత్త ఏడాదిని ప్రారంభించిన బాబర్ ఆజమ్.. 

2023 ఏడాదిలో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ టెస్టు పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్. తొలి టెస్టు డ్రాగా ముగియడంతో ఈ మ్యాచ్‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ఏడాదిలో జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్‌లో కొంత హై డ్రామా చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది...

గత ఏడాది మొట్టమొదటి అంతర్జాతీయ టెస్టు సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు డివాన్ కాన్వే. ఈ ఏడాది కూడా ఆ రికార్డు కాన్వేకే దక్కింది. పాకస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 122 పరుగులు చేసి 2023 ఏడాదిలో తొలి సెంచరీ అందుకున్నాడు డివాన్ కాన్వే.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 131 ఓవర్లు బ్యాటింగ్ చేసి 449 పరుగులు చేసింది. టామ్ లాథమ్ 100 బంతుల్లో 9 ఫోర్లతో 71 పరుగులు చేసి అవుట్ కాగా డివాన్ కాన్వే 191 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 122 పరుగులు చేశాడు.

కేన్ విలియంసన్ 91 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేయగా హెన్రీ నికోలస్ 56 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. డార్ల్ మిచెల్ 3 పరుగులు చేయగా బ్రాస్‌వెల్ డకౌట్ అయ్యాడు. సౌథీ 10, ఇష్ సోదీ 11 పరుగులు చేయగా టామ్ బ్లండెల్ 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 345 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్...

ఈ దశలో అజాజ్ పటేల్, మ్యాట్ హెన్రీ కలిసి 10వ వికెట్‌కి 104 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి, న్యూజిలాండ్ స్కోరుని 400+ మార్కు దాటించారు. న్యూజిలాండ్ తరుపున 10వ వికెట్‌కి ఇది నాలుగో అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 1973లో పాకిస్తాన్‌పైనే బ్రియాన్ హస్టింగ్స్, రిచర్డ్ కోలింగ్ కలిసి 151 పరుగులు జోడించి టాప్‌లో ఉన్నారు. ..

పాక్ బౌలర్లలో అబరర్ అహ్మద్‌కి 4 వికెట్లు దక్కగా, అఘా సల్మాన్, నసీం షాలకు మూడేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అబ్దుల్లా షాఫీక్ 19 పరుగులు చేయగా షాన్ మసూద్ 20 పరుగులు చేశాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఇమామ్ వుల్ హక్, బాబర్ ఆజమ్ కలిసి ఒకే ఎండ్‌కి పరుగెత్తారు.. నాన్ స్ట్రైయికర్‌లో ఉన్న బాబర్ ఆజమ్ లేని పరుగు కోసం ప్రయత్నించగా ఇమామ్ వుల్ హక్ స్పందించలేదు. రనౌట్ నుంచి తప్పించుకునేందుకు ఇమామ్ వుల్ హక్‌ని క్రీజు దాటాల్సిందిగా బాబర్ ఆజమ్ సూచించినా... అతను పట్టించుకోలేదు. దీంతో బాబర్ ఆజమ్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది... రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇమామ్ వుల్ హక్ 66 పరుగులు చేసి హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.