Asianet News TeluguAsianet News Telugu

శార్దూల్ ఠాకూర్ కావాలి, కానీ అక్షర్ పటేల్ ఏం తప్పు చేశాడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో అక్షర్ పటేల్‌ను తప్పించి, శార్దూల్ ఠాకూర్‌కి చోటు ఇచ్చిన సెలక్టర్లు... యూఏఈలో అదరగొట్టే పర్ఫామెన్స్ ఇచ్చినా, అక్షర్ పటేల్‌కి నిరాశే...

Axar Patel must be thinking what he did wrong, Irfan pathan re-acts on Shardul Thakur Inclusion
Author
India, First Published Oct 14, 2021, 4:36 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్ ముగింపు సమయంలో ఓ మార్పు చేసింది బీసీసీఐ. స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను తప్పించి, స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దూల్ ఠాకూర్‌ను తుదిజట్టులోకి చేర్చారు సెలక్టర్లు. శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి చేర్చడం వరకూ ఓకే కానీ, యూఏఈలో అదరగొడుతున్న అక్షర్ పటేల్‌ను తుదిజట్టు నుంచి తప్పించడంపైనే విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ లిస్టులో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరాడు...

‘టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి జట్టుని ప్రకటించినప్పుడు ఎంపిక చేసిన టీమ్‌లో ఓ ఫాస్ట్ బౌలర్ తక్కువయ్యాడని అనిపించింది. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీతో లెక్క సరిపోయింది. అతను టీమిండియాకి చక్కగా ఉపయోగపడతాడు. అయితే అక్షర్ మాత్రం తానేం తప్పుచేశానో తెలియక తెగ ఫీల్ అవుతూ ఉండొచ్చు. అతనికి టీ20 వరల్డ్‌కప్ ఆడేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఐపీఎల్‌లో వరుసగా రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులు గెలిచిన తర్వాత కూడా అక్షర్ పటేల్‌ను తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 6.48 ఎకానమీతో బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్, 15 వికెట్లు తీసి అదరగొట్టాడు. అక్షర్ పటేల్ పర్ఫామెన్స్‌లో సగం కూడా ఇవ్వలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, యూఏఈలో ఘోరంగా ఫెయిల్ అయి నాలుగు మ్యాచుల్లో రెండే వికెట్లు తీసిన రాహుల్ చాహార్‌కి కూడా టీ20 వరల్డ్‌కప్‌ 2021 జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే..

శార్దూల్ ఠాకూర్‌ను జత చేయడంతో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో నలుగురు ప్రధాన పేసర్లతో బరిలో దిగనుంది టీమిండియా. ఇప్పటికే భారత సీనియర్ పేసర్లు జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు టీ20 జట్టులో చోటు దక్కింది...

Follow Us:
Download App:
  • android
  • ios