జ్వరంతో బాధపడుతున్న ఆవేశ్ ఖాన్... గాయంతో ఆసియా కప్‌కి దూరమైన రవీంద్ర జడేజా... భారత జట్టును వెంటాడుతున్న ఫిట్‌నెస్ సమస్యలు...
ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియాని ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు వదలడం లేదు. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడడంతో ఇద్దరు ప్రధాన ఫాస్ట్ బౌలర్లు లేకుండా టోర్నీకి మొదలెట్టిన భారత జట్టు, రెండు మ్యాచులు ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా రూపంలో మరో స్టార్ ప్లేయర్‌ని కోల్పోయింది. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ టోర్నీకి కూడా దూరమయ్యాడు...
రవీంద్ర జడేజా మోచేతికి అయిన గాయానికి శస్త్ర చికిత్స అవసరమని, అతను పూర్తిగా కోలుకోవడానికి మూడు నెలల వరకూ సమయం పడుతుందని తేలింది. పాక్‌పై ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన జడ్డూ లేని లోటు, టీమిండియాపై తీవ్రంగానే పడనుంది. తాజాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు టీమిండియాకి మరో షాక్ తగిలింది. భారత యంగ్ ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్... జ్వరంతో బాధపడుతూ పాక్‌తో మ్యాచ్‌కి దూరమయ్యాడు.
పాకిస్తాన్‌తో సూపర్ 4 రౌండ్ మ్యాచ్‌కి ముందు మీడియా సమావేశానికి హాజరైన భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ఆవేశ్ ఖాన్ ఆరోగ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఆవేశ్ ఖాన్ కాస్త అనారోగ్యానికి గురయ్యాడు. ఈ వాతావరణం పడకపోవడం వల్ల అతనికి జ్వరం వచ్చింది. ప్రస్తుతం అతను డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాడు. ఈరోజు అతను ప్రాక్టీస్‌కి రాలేదు.. అతను త్వరలోనే కోలుకుని, జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం...
పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకపోయినా మిగిలిన మ్యాచులకు ఆవేశ్ ఖాన్ అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నాం. ’ అంటూ కామెంట్ చేశాడు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...
ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు కరోనా బారిన పడిన రాహుల్ ద్రావిడ్, మొదటి రెండు మ్యాచులకు దూరంగా ఉన్నాడు. రెండు రోజుల కిందట హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి చేసిన పరీక్షల్లో నెగిటివ్‌గా తేలడంతో యూఏఈ చేరుకుని భారత జట్టుతో కలిశాడు.
ఆవేశ్ ఖాన్, ఈ ఆసియా కప్ 2022 టోర్నీలో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్‌లో 19 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన ఆవేశ్ ఖాన్, హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 53 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయాల్సిందిపోయి, ధారాళంగా పరుగులు సమర్పిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఆవేశ్ ఖాన్. ఆవేశ్ ఖాన్ జ్వరంతో బాధపడుతుండడంతో భారత జట్టు, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యాలను ఫాస్ట్ బౌలర్లుగా వాడనుంది... హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో ఓ ఓవర్ బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీని కూడా ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా ఉపయోగించుకోవచ్చు...
రవీంద్ర జడేజా స్థానంలో ఆసియా కప్ 20222కి వచ్చిన అక్షర్ పటేల్‌కి పాక్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఆల్‌రౌండర్ దీపక్ హుడా లేదా రవిభిష్ణోయ్‌కి జడేజా ప్లేస్‌లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
