Asianet News TeluguAsianet News Telugu

బ్రాడ్మన్ రికార్డును సమం చేసిన ఆసీస్ మాజీ సారథి.. డబుల్ సెంచరీల మోత మోగించిన లబూషేన్, స్మిత్

AUS vs WI 1st Test: స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా పరుగుల వరద పారిస్తున్నది. టాప్ -5 బ్యాటర్లు రాణించడంతో  కరేబియన్ దీవులపై కంగారూలు ఆధిపత్యం చెలాయించారు.  

AUSvsWI Test: Labuschagne and Steaven Smith Double Tons Helps Australia to 598/4 Declared
Author
First Published Dec 1, 2022, 1:59 PM IST

టీ20 ప్రపంచకప్ లో  గ్రూప్ స్టేజ్ లోనే విఫలమై తీవ్ర నిరాశకు గురైన  ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రం రెచ్చిపోతున్నది.  మెగా టోర్నీ ముగిశాక ఇంగ్లాండ్ ను వన్డేలలో 3-0తో ఓడించిన కంగారులు.. అదే జోరును వెస్టిండీస్ మీద కూడా చూపిస్తున్నారు.  పెర్త్ వేదికగా విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బుధవారం మొదలైన ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన  ఆసీస్.. ఆట రెండో రోజు 152.4 ఓవర్లలో  4 వికెట్లు కోల్పోయి 598 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఆ జట్టులో లబూషేన్, స్టీవ్ స్మిత్ లు డబుల్ సెంచరీలు సాధించారు. 

రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు  293-2 వద్ద   ఆట మొదలుపెట్టిన  ఆసీస్..దూకుడుగా ఆడింది.   బుధవారమే సెంచరీ చేసిన లబూషేన్.. నేడు డబుల్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.  350 బంతులాడి  20 ఫోర్లు, 1 సిక్సర్  సాయంతో 204 రన్స్ చేశాడు.   ఇక స్మిత్ కూడా.. 59 పరుగుల వద్ద  రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించి.. విండీస్ బౌలర్ల దుమ్ము దులిపాడు. 311 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో 200 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

లబూషేన్ తో కలిసి   251 పరుగులు జోడించిన స్మిత్.. తర్వాత ట్రావిస్ హెడ్ (99) తో కలిసి 196 పరుగులు జోడించాడు. స్మిత్ డబుల్ సెంచరీ పూర్తైన తర్వాత ట్రావిస్ హెడ్ సెంచరీ ముంగిట  ఔట్ కావడంతో  కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసీస్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. డేవిడ్ వార్నర్ (5) తప్ప  ఆసీస్ బ్యాటర్లలో ఖవాజా (65), లబూషేన్, స్మిత్, హెడ్ లు  రాణించడం విశేషం. 

 

బ్రాడ్మన్ రికార్డును సమం చేసిన స్మిత్.. 

టెస్టు క్రికెట్ లో ప్రపంచ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ రికార్డును  ఆస్ట్రేలియా బ్యాటర్ స్మిత్ సమం చేశాడు.   టెస్టులలో స్మిత్ కు ఇది 29వ సెంచరీ.  బ్రాడ్మన్ కూడా  టెస్టులలో 29 సెంచరీలు చేశాడు. కానీ స్మిత్ తన 29వ సెంచరీ చేయడానికి 88 టెస్టులు ఆడాల్సి వస్తే బ్రాడ్మన్ మాత్రం.. 52 టెస్టులలోనే ఈ ఘనత సాధించాడు.  టెస్టులలో ప్రపంచ క్రికెట్ లో మరెవరికీ లేని విధంగా బ్రాడ్మన్ సగటు 99.94గా ఉండటం గమనార్హం.  టెస్టులలో ఆస్ట్రేలియా తరఫున  అత్యధిక  సెంచరీలు చేసిన వారి జాబితాలో స్మిత్.. పాంటింగ్ (41), హేడెన్ (30) తర్వాత నిలిచాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios