ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆసీస్ కు భారీ షాక్.. వికెట్ కీపర్‌కు గాయం.. మెగా టోర్నీలో ఆడేది అనుమానమే..!
T20 World Cup 2022: మరో మూడు రోజుల్లో ప్రపంచకప్ సూపర్-12 పోటీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆసీస్ జట్టుకు భారీ షాక్ తాకింది. ఆ జట్టు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ చేతికి గాయమైంది.
టీ20 ప్రపంచకప్ లో ప్రస్తుతం అర్హత రౌండ్స్ తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా సాగుతున్నాయి. ఈ నెల 21న వీటన్నింటికీ తెరపడి 22న అసలు టోర్నీ మొదలుకానుంది. మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరుగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఆటగాడు, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ చేతికి గాయమైంది. గోల్ఫ్ ఆడుతూ ఇంగ్లిస్ గాయపడటంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఇంగ్లిస్.. బుధవారం ఉదయం గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. గాయాన్ని పరిశీలించిన వైద్యులు అది తీవ్రమైందని తేల్చారు. దీంతో ఈనెల 22న ఆ జట్టు న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో ఇంగ్లిస్ దూరం కానున్నాడు.
ఆస్ట్రేలియా జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఉన్నా అతడికి స్టాండ్ బై గా ఇంగ్లిస్ ను ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఇంగ్లిస్ గాయపడటంతో వేడ్ మీద ఒత్తడి పడనుంది. ఇదిలాఉండగా ఇంగ్లిస్ గాయం తీవ్రతను బట్టి అతడు ఈ మెగా టోర్నీలో ఆడతాడా..? లేదా..? అనేది త్వరలోనే తేలనుంది.
గోల్ఫ్ ఆడుతూ గాయపడిన వారి జాబితాలో ఇంగ్లాండ్ హిట్టర్ జానీ బెయిర్ స్టో కూడా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన జట్టులో బెయిర్ స్టో ఉన్నా.. అతడు గోల్ప్ ఆడుతూ గాయపడ్డాడు. దీంతో అతడు పొట్టి ప్రపంచకప్ తో పాటు రాబోయే ఆరు నెలల పాటు క్రికెట్ ఆడేది అనుమానమే.
టీ20 ప్రపంచకప్ అసలు ఆటకు ముందు గాయాలు వివిధ జట్లను వేధిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంకకు చెందిన దిల్షాన్ మధుశంక, దుష్మంత చమీర లు గాయాల కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. వీరితో పాటు గుణతిలక, ప్రమోద్ మధుశంక కూడా గాయాలతోనే సతమతమవుతున్నారు. భారత జట్టులో రిషభ్ పంత్ కూడా గాయంతోనే ఉన్నట్టు ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గాయాలు ఆయా జట్లను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి.