మ్యాచ్‌లో గెలిచినప్పుడు, వికెట్ పడగొట్టినప్పుడు లేదా సెంచరీ, హాఫ్ సెంచరీల వంటి సందర్భాల్లో క్రికెటర్లు కొన్ని ప్రత్యేకమైన మేనరిజమ్‌లతో అభిమానులను ఆకట్టుకుంటూ వుంటారు.

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన సమయంలో బ్యాట్‌ని కత్తిలా తిప్పుతూ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. గుజరాత్‌లోని రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన జడేజాకు గుర్రపు స్వారి, కత్తిసాములో మంచి ప్రావీణ్యం ఉంది. దీంతో బ్యాట్‌ని సైతం కత్తిలా తిప్పుతుంటాడు.

Also Read:కరోనా కోసం మ్యాచ్‌లు ఆడదామన్న అక్తర్: ఇండియా వద్ద బోల్డంత డబ్బుందన్న కపిల్

ఈ నేపథ్యంలో జడేజా మేనరిజాన్ని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అనుకరించే ప్రయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం ఓ యాడ్‌ను రూపొందించారు నిర్వాహకులు.

ఇందులో వార్నర్ బ్యాట్‌ని కత్తిలా తిప్పాడు. అయితే ఈ యాడ్ ఇప్పటిది కాదు. గతేడాది దీని షూటింగ్ జరగ్గా తాజాగా సోషల్ మీడియాలో దీనిని అభిమానులతో పంచుకున్నాడు వార్నర్.

దీనిలో ‘‘ జడేజాలా బ్యాట్‌ను అందంగా ఎవరు తిప్పలేరు.. అందుకే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. తాను అచ్చం జడ్డూలా తిప్పానా అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించాడు. ఐపీఎల్ 2020 సీజన్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్‌గా వార్నర్ మళ్లీ ఎంపికయ్యాడు.

Also Read:వాళ్ల వీడియోకి రవిశాస్త్రి ట్రేసర్ బులెట్ ఆడియో.. నెట్టింట వైరల్

జడేజా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌.... ఏప్రిల్ 15 నాటికి వాయిదా పడింది. అయితే దేశంలో పరిస్ధితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.