Asianet News TeluguAsianet News Telugu

మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి.. షఫాలీ మెరిసినా బ్యాటర్లు విఫలం..

భారత పర్యటనలో ఉన్న ఆసీస్ మహిళల క్రికెట్ జట్టు రెండో మ్యాచ్ లో ఉత్కంఠభరితంగా సాగిన  సూపర్ ఓవర్ లో ఓడినా మూడో మ్యాచ్ లో  మాత్రం  విజయం సాధించింది.  భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యంతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. 

Australia Women Beat Harmanpreet Kaur Led Team India by 21 Runs in 3rd T20I
Author
First Published Dec 15, 2022, 11:44 AM IST

బ్యాటింగ్ వైఫల్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో  జరిగిన మూడో టీ20 లో  ఓటమిపాలైంది.  తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించిన ఆస్ట్రేలియా.. తర్వాత బౌలింగ్ లో కూడా రాణించి సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.  ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ముంబై లోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా  జరిగిన మూడో టీ20 లో  తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా..  8 వికెట్ల నష్టానికి  172 పరుగులు చేసింది.   ఎలీస్ పెర్రీ.. 47 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసింది.    లక్ష్య ఛేదనలో భారత్..  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  151 పరుగులు మాత్రమే చేయగలిగింది.   ఫలితంగా భారత్.. 21 పరుగుల తేడాతో ఓడింది. ఈ విజయంతో  ఆస్ట్రేలియా.. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. 

బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముగిసిన మూడో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్.. ఐదు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.  కెప్టెన్ హీలి (1), తహిల మెక్‌గ్రాత్ (1) లు విఫలమయ్యారు. కానీ  మూనీ (30)తో కలిసి పెర్రీ దూకుడుగా ఆడింది.  ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 64 పరుగులు జోడించారు. 

మూనీ నిష్క్రమించిన తర్వాత  గార్డ్‌నర్ (7) కూడా విఫలమైంది.  నాలుగు వికెట్లు కోల్పోయినా భారత్ మ్యాచ్ పై పట్టు సాధించలేకపోయింది. గ్రేస్ హరిస్.. 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసింది.    పెర్రీ కూడా వీరవిహారం చేయడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. 

 

లక్ష్య ఛేదనలో భారత్ కు  మొదట్లోనే షాక్ తాకింది. ఓపెనర్ బ్యాటర్ స్మృతి మంధాన.. ఒక్క పరుగు మాత్రమే చేసి   పెవిలియన్ చేరింది. కానీ  మరో ఓపెనర్ షఫాలీ వర్మ (41 బంతుల్లో  52, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్  సెంచరీతో రాణించింది.  జెమీమా రోడ్రిగ్స్ (16) మరోసారి విఫలమవ్వగా  హర్మన్‌ప్రీత్ కౌర్.. 27 బంతుల్లో 6 ఫోర్లు బాది 37 పరుగులు చేసి దూకుడుగా కనిపించింది.  కానీ  షఫాలీ నిష్క్రమించిన తర్వాత భారత్  త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది.  ఆఖర్లో దీప్తి శర్మ (25 నాటౌట్) మెరుపులు మెరిపించినా   లాభం లేకపోయింది.  ఇరు జట్ల మధ్య  నాలుగో టీ20 ఇదే వేదికపై 17న  జరగాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios