Asianet News TeluguAsianet News Telugu

హెన్రీచ్ క్లాసిన్ ఊర మాస్ బ్యాటింగ్, మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్! ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోసి...

83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 174 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, 45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్... 416 పరుగుల భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికా... ఆడమ్ జంపా ఖాతాలో చెత్త రికార్డు.. 

Australia vs South Africa 4th ODI: Heinrich Klaasen record breaking century, David Miller innings CRA
Author
First Published Sep 15, 2023, 9:26 PM IST

ఆస్ట్రేలియా చేతుల్లో వరుసగా రెండు వన్డేల్లో ఓడిన సౌతాఫ్రికా, మూడో వన్డేలో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. మూడో వన్డేలో అయిడిన్ మార్క్‌రమ్ సెంచరీతో అదరగొడితే, సెంచూరియన్‌లో జరుగుతున్న నాలుగో వన్డేలో హెన్రీచ్ క్లాసిన్... ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు.. క్లాసిన్‌ సిక్సర్ల మోతకి, డేవిడ్ మిల్లర్ బాదుడు కూడా తోడు కావడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 416 పరుగుల భారీ స్కోరు చేసింది. 

83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 174 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్ ఇన్నింగ్స్ కారణంగా 250 దాటడమే కష్టమనుకున్న సౌతాఫ్రికా స్కోరు 400+ దాటేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, బౌలింగ్ ఎంచుకుంది. 34 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన రజా హెండ్రీక్స్, నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు..

64 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, హజల్‌‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ 11 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన వాన్ దేర్ దుస్సేన్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

34.4 ఓవర్లు ముగిసే సరికి 194 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన హెన్రీచ్ క్లాసిన్, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన డేవిడ్ మిల్లర్ కలిసి ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 

32 ఓవర్లు ముగిసే సమయానికి 25 బంతుల్లో 24 పరుగులే చేసిన హెన్రీచ్ క్లాసిన్, 38 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత 19 బంతుల్లోనే మరో 50 పరుగులు చేశాడు. 57 బంతుల్లో సెంచరీ అందుకున్న హెన్రీచ్ క్లాసిన్, 77 బంతుల్లో 150 పరుగుల మార్కు దాటాడు. 

తాను ఎదుర్కొన్న ఆఖరి 58 బంతుల్లో 150 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్, అత్యంత వేగంగా 150+ స్కోరు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. ఏబీ డివిల్లియర్స్ 64 బంతుల్లో, జోస్ బట్లర్ 65 బంతుల్లో (2022లో), 76 బంతుల్లో (2019లో) 150+ స్కోర్లు చేస్తే, హెన్రీచ్ క్లాసిన్ 77 బంతుల్లో 150+ స్కోరు చేశాడు..

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు హెన్రీచ్ క్లాసిన్. ఇంతకుముందు 1983లో జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 పరుగులు చేశాడు. హెన్రీచ్ క్లాసిన్, డేవిడ్ మిల్లర్ కలిసి ఆరో వికెట్‌కి 94 బంతుల్లో 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ నాటౌట్‌గా నిలిచాడు. హెన్రీచ్ క్లాసిన్, ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. వన్డేల్లో 400+ స్కోరు చేయడం సౌతాఫ్రికాకి ఇది ఏడో సారి. ఆరుసార్లు వన్డేల్లో 400+ స్కోరు చేసిన భారత జట్టు రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ఐదు సార్లు 400+ స్కోర్ చేయగా మిగిలిన ఏ జట్టూ మూడు సార్లు కూడా 400 మార్కు దాటలేకపోయాయి. 

క్లాసిన్, మిల్లర్ బౌండరీల మోతకి 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆసీస్ యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 113 పరుగులు సమర్పించాడు. 2006లో సౌతాఫ్రికాపై ఆసీస్ బౌలర్ మిక్ లూయిస్ 10 ఓవర్లలో 113 పరుగులు సమర్పించి, అత్యధిక పరుగులు సమర్పించిన వన్డే బౌలర్‌గా ఉన్నాడు. 17 ఏళ్ల తర్వాత ఆడమ్ జంపా ఆ చెత్త రికార్డును మళ్లీ సౌతాఫ్రికాపైనే సమం చేయడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios