Asianet News TeluguAsianet News Telugu

గబ్బా టెస్టులో బౌలర్ల డామినేషన్... 152 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్! వార్నర్ గోల్డెన్ డక్...

తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకి సౌతాఫ్రికా ఆలౌట్... ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చిన సఫారీ బౌలర్లు... డేవిడ్ వార్నర్ గోల్డెన్ డక్.. 

Australia vs South Africa 1st Test: SA all-out for 152 runs, Australia lost 3 early wickets
Author
First Published Dec 17, 2022, 12:11 PM IST

వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ని ఘనంగా ప్రారంభించింది. బాగా అచొచ్చిన బ్రిస్బేన్, గబ్బా స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకి బ్యాటింగ్ అప్పగించింది..

తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 48.2 ఓవర్లలో 152 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 3 పరుగులు చేసి అవుట్ కాగా సారెల్ ఇర్వ్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వాన్ దేర్ దుస్సేన్ 5 పరుగులు చేయగా జొండో డకౌట్ అయ్యాడు. తెంబ బవుమా 70 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేసి కీలక పరుగులు చేయగా సౌతాఫ్రికా వికెట్ కీపర్ కేల్ వెరెన్నీ 96 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 పరుగులు చేశాడు...

గబ్బాలో హాఫ్ సెంచరీ చేసిన రెండో సౌతాఫ్రికా వికెట్ కీపర్‌గా నిలిచాడు వెరెన్నీ. ఇంతకుముందు 1963లో జాన్ వైట్ 66 పరుగులు చేసి అవుట్ కాగా వెరెన్సీ 64 పరుగులకి పెవిలియన్ చేరాడు.  మార్కో జాన్సన్ 2, కేశవ్ మహారాజ్ 2, లుంగి ఇంగిడి 3 పరుగులు చేసి అవుట్ కాగా ఆన్రీచ్ నోకియా డకౌట్ అయ్యాడు. కగిసో రబాడా 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ మూడేసి వికెట్లు తీయగా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, బొలాండ్ రెండేసి వికెట్లు తీశారు. అయితే ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే అవుట్ చేశామనే ఆనందం ఆస్ట్రేలియాకి ఎక్కువ సేపు నిలవలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా...

కగిసో రబాడా బౌలింగ్‌లో వార్నర్ బ్యాటుకి తగిలిన బౌన్సర్, వెళ్లి జొండో చేతుల్లో వాలింది. టెస్టుల్లో డేవిడ్ వార్నర్‌ని అవుట్ చేయడం రబాడాకి ఇది ఐదోసారి. ఇంతకుముందు 2013లో శ్రీలంకపై టెస్టు మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన డేవిడ్ వార్నర్, మళ్లీ ఇన్నాళ్లకు మొదటి బంతికే వికెట్ పారేసుకున్నాడు...

26 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో అవుట్ కాగా 24 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా...

స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ కలిసి ఆస్ట్రేలియా స్కోరుని 50+ మార్కు దాటించారు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకుంటే ఆస్ట్రేలియాకి భారీ ఆధిక్యం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios