టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు న్యూ ఇయర్ లో సూపర్ గిఫ్ట్ అందింది. రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ ఇచ్చారు.  ఐపీఎల్‌లో చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ అయిన రోహిత్‌ను కోహ్లి లేని భారత టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్‌ రహానేకు చేదోడు–వాదోడుగా నియమించారు. దీంతో వైస్‌ కెప్టెన్‌ బాధ్యతల్లేని చతేశ్వర్‌ పుజారా ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది. ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో పుజారా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్‌కు వైస్‌ కెప్టెన్సీ తాత్కాలికం కావడం గమనార్హం.

రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి పెటర్నటీ లీవ్స్‌ ముగించుకొని రాగానే మళ్లీ రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు వెల్లడించారు. అతను తుది జట్టులో ఖాయమైనప్పటికీ ఓపెనింగ్‌లో దిగుతాడా లేదంటే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడా అన్నదానిపై స్పష్టత లేదు. 14 రోజుల క్వారంటైన్‌ పూర్తయిన రోహిత్‌ శర్మ జట్టుతో చేరాడు. ప్రస్తుతం మూడో టెస్టు కోసం అతను సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు జరుగుతుంది