టీమిండియా ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలుచుకుంది. అసలు గెలుపు అసాధ్యమనుకున్న సమయంలో.. విజయం రుచి చూపించింది. కంగారులను మట్టి కరిపించి చారిత్రాత్మక విజయాన్ని అందించింది. కీలక ఆటగాళ్లు లేకున్నా.. యువ ఆటగాళ్లు గెలుపు తలుపు తట్టారు.

పలువురు‌ ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ ఒత్తిడిని జయిస్తూ, యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి జట్టును ముందుండి నడిపించాడు. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్‌ ఛేదించింది. రిషభ్‌ పంత్‌ దూకుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్‌ తోడవడంతో ఆసీస్‌ గడ్డపై విజయాన్ని సాధించింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుని గబ్బా మైదానంలో కంగరూలను ఓడించింది. 

ఈ విజయంపై కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ రహానేలు స్పందించారు. టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ఉద్వేగానికి లోనయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో భారత జట్టు అద్భుత ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఓవైపు కోవిడ్‌-19 భయాలు, మరోవైపు వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడటం.. 36 పరుగులకే ఆలౌట్‌ కావడం వంటి అనూహ్య పరిణామాలని చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు పట్టుదలతో ముందుకు సాగిందని.. అద్భుత ప్రదర్శన కనబరిచిందని చెప్పుకొచ్చాడు. నిజానికి నేను సాధారణంగా ఎమోషనల్‌ కాను. కానీ ఇప్పుడు నిజంగానే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని అన్నాడు రవిశాస్త్రి. జట్టు చరిత్రలోనే ఈ సిరీస్‌ ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నాడు.  

కెప్టెన్‌ అజింక్య రహానే మాట్లాడుతూ.. అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఈ సిరీస్‌ విజయాన్ని అభివర్ణించేందుకు మాటలు రావడం లేదని అన్నాడు. చాలా ఎమోషనల్‌ అయిపోయానని.. అడిలైడ్‌ టెస్టు పరాజయం తర్వాత ప్రతీ ఒక్క ఆటగాడు పట్టుదలతో ఆడామని తెలిపాడు. ఈ గెలుపులో ప్రతీ ఆటగాడికి భాగస్వామ్యం ఉందని.. ముఖ్యంగా రిషభ్‌, నట్టు(నటరాజన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ బంతితో, బ్యాట్‌తో మ్యాజిక్‌ చేశారని అన్నాడు రహానే.