ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ 2019 లో ఆతిథ్య ఇంగ్లాండ్ మొదటి విజయాన్ని అందుకుంది. లీడ్స్ వేదికన జరిగిన మూడో టెస్ట్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్(135 పరుగులు నాటౌట్) పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. చివరకు 11వ నంబర్ ఆటగాడితో కలిసి ఏకంగా 73పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరీ స్టోక్స్ తమ జట్టును గెలిపించుకున్నాడు.  

అయితే ఆస్ట్రేలియా ఓటమితో రగిలిపోతున్న మాజీ ఆటగాళ్లు కెప్టెన్ టిమ్ పైనీ విమర్శలు గుప్పిస్తున్నారు. అతడి అనాలోచిన నిర్ణయాలే ఈ ఓటమికి దారితీశాయంటూ ఆరోపిస్తున్నాడు. అతడు ఇకముందయినా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానేసి బౌలర్లను, సీనియర్లను సంప్రదించడాన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ముఖ్యంగా ఈ మ్యాచ్ చివర్లో పైనీ అనవసరంగా ఓ రివ్యూను వాడుకున్నాడు. జాక్ లీచ్ ను ఔట్ చేయాలన్న అత్యుత్సాహంతో పైనీ ఎల్బీకి అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో డీఆర్ఎస్ కు వెళ్లాడు. అయితే బంతి వికెట్లకు దూరంగా వెళుతున్నట్లు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ కూడా దీన్ని నాటౌట్ గా ప్రకటించాడు. అయితే ఆ తర్వాత స్టోక్స్ విషయంలో రివ్యూకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. 

నాథన్ లియాన్ బౌలింగ్  లో స్టోక్స్ స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించి  వికట్ల ముందు దొరికిపోయాడు. ఆసిస్ ఆటగాళ్లు అప్పీల్ చేసినా అంపైర్లు స్పందించలేదు. అయితే అప్పటికే రివ్యూ చాయిస్ లు కూడా అయిపోవడంతో ఆసిస్ ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే తర్వాత రిప్లేలో బంతి నేరుగా మిడ్ వికెట్ వైపు వెళుతున్నట్లు తేలింది. అంతకుముందు లీచ్ విషయంలో వృధా అయిన రివ్యూను ఇక్కడ వాడుకుని వుంటే ఆస్ట్రేలియా గెలిచేది.  ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీలతో పాటు ఆసిస్ అభిమానులు కెప్టెన్ పైనీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మాజీ ఆసిస్ ప్లేయర్ ఇయాన్ చాపుల్ తమ కెప్టెన్ మతిపోయిందంటూ తీవ్ర విమర్శ  చేశాడు. అలాగే మరో ఆటగాడు మార్క టేలర్ సైతం ఈ ఓటమికి పైనీ తప్పుడు నిర్ణయాలే కారణమంటూ విమర్శించాడు. ఆసిస్ ఓటమితో ఐదు టెస్టుల యాషెస్ సీరిస్ లో ఇరుజట్లు 1-1తో సమానంగా నిలిచాయి.