Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ కు గుడ్ న్యూస్.. 24 ఏండ్ల తర్వాత పాక్ కు రానున్న ఆస్ట్రేలియా.. డబుల్ ఖుషిలో ఫ్యాన్స్

Australia Tour Of Pakistan: స్వదేశంలో టెస్టు సిరీస్ ల కోసం  ఇతర దేశాల వంక  ధీనంగా చూస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. తన అభిమానులకు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టు.. పాకిస్థాన్ పర్యటనకు రానున్నది.

Australia Tour Of Pakistan for all Format series starts from March 2022
Author
Hyderabad, First Published Nov 8, 2021, 4:34 PM IST

ఎడారిలో  నీటి కోసం  కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలిసిపోయినవాడికి నీటి చెమ్మ కనబడితే ఎలా ఉంటుంది..? ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషం ఆ వ్యక్తి సొంతం. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ తో పాటు ఆ జట్టు అభిమానులది అదే ఫీలింగ్. యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్.. ఆ జట్టు తలరాతను మార్చింది. గ్రూప్ దశలో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచిన ఆ జట్టుకు మరో శుభవార్త. 

స్వదేశంలో టెస్టు సిరీస్ ల కోసం  ఇతర దేశాల వంక  ధీనంగా చూస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. తన అభిమానులకు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టు.. పాకిస్థాన్ పర్యటనకు రానున్నది. మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 ఆడే నిమిత్తం ఆసీస్ జట్టు.. పాక్ కు పయనం కానున్నది. ఈ విషయాన్ని పీసీబీ తో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ప్రకటించింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఇరు దేశాల బోర్డుల అధిపతులు హర్షం వ్యక్తం చేశారు.  

 

కాగా..  ఆసీస్ తమ దేశంలో సిరీస్ ఆడటం కోసం పాక్ ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 24 ఏండ్లు వేచి చూడాల్సి వచ్చింది. అంటే దాదాపుగా ఒక తరం. ఆసీస్ చివరిసారి.. 1998లో పాక్ లో పర్యటించింది. అప్పుడు మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడింది. ఈ రెండు సిరీస్ లను కంగారూలే గెలుచుకున్నారు.

ఆ తర్వాత 2002లో ఆసీస్.. పాక్ పర్యటనకు రావాల్సి ఉన్నా కరాచీలో బాంబు పేలుళ్ల ఘటన అనంతరం ఆ సిరీస్ రద్దైంది. 2008లో మరోసారి సిరీస్ కోసం పాక్ ఆహ్వానాన్ని మన్నించిన ఆసీస్.. అందుకు ఒప్పుకుంది. అయితే ఈసారి పాకిస్థాన్ లో అధ్యక్ష ఎన్నికలకు ముందు దేశమంతా హింస రాజుకుంది.  దీంతో ఈ సిరీస్ కూడా రద్దైంది. ఇక 2009లో పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టుపై తీవ్రవాదులు కాల్పులు (లాహోర్ లో) జరపడంతో.. అంతర్జాతీయ క్రికెట్ ఆడే దేశాలు ఆ దేశానికి వెళ్లాలంటేనే భయపడుతున్నాయి. 

అయితే సుమారు 18 ఏండ్ల తర్వాత.. న్యూజిలాండ్ జట్టు గత నెలలో పాక్ తో మూడు టీ20లు ఆడటానికి ఇక్కడకు వచ్చింది. కానీ  భద్రతా కారణాలను చూపి చివరి నిమిషంలో సిరీస్ ను అర్థాంతరంగా రద్దు చేసుకుని వెళ్లిపోయింది. ఇది పాక్ క్రికెట్ కు పెద్ద దెబ్బ. న్యూజిలాండ్ అలా చేసిన రెండ్రోజులకే  ఇంగ్లాండ్ కూడా ఇదే పని చేసింది. ఈ రెండు సిరీస్ ల రద్దు కారణంగా పాక్ క్రికెట్ సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితికి వెళ్లింది. టీ20  ప్రపంచకప్ నకు ముందే ఈ  దెబ్బలు తగలడంతో ఆ జట్టు కుంగుబాటుకు గురైంది. అయితే  ఈ బాధలన్నింటినీ భరించిన పాక్ ఆటగాళ్లు.. టీ20 టోర్నీలో అదరగొడుతున్నారు.  ప్రపంచకప్ లో ఇప్పటిదాకా నిలకడగా రాణించిన జట్టు పాకిస్థానే అంటే అతిశయోక్తి కాదేమో. అనిశ్చితికి మారుపేరుగా ఉండే ఆ జట్టు.. బాబర్ ఆజమ్ నేతృత్వంలో ఆ ముద్రను చెరిపేసుకుంది. ఇప్పటికే సెమీస్ చేరిన పాక్.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియను ఢీకొననుండటం గమనార్హం. 

ఇక  పాకిస్థాన్-ఆస్ట్రేలియా సిరీస్ విషయానికొస్తే.. 2022 మార్చిలో ఈ సిరీస్ మొదలుకానున్నది. సిరీస్ షెడ్యూల్ కింది విధంగా ఉంది. 

మార్చి 3-7.. తొలి టెస్టు.. కరాచీ 
మార్చి 12-16.. రెండో టెస్టు.. రావల్పిండి
మార్చి 21-25.. మూడో టెస్టు.. లాహోర్
మార్చి 29: తొలి వన్డే.. లాహోర్
మార్చి 31: రెండో వన్డే.. లాహోర్
మార్చి 31: మూడో వన్డే.. లాహోర్
ఏప్రిల్ 5: ఏకైక టీ20.. లాహెర్

 

Follow Us:
Download App:
  • android
  • ios