Pakistan Vs Australia- Pat Cummins: అతడు బంతి విసిరితే ప్రపంచంలోని ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా గజగజ వణకాల్సిందే. ప్రపంచంలో నెంబర్ వన్ బౌలర్ గా ఉన్న ఆస్ట్రేలియా సారథి బంతిని వదిలి సుత్తెను పట్టాడు.. ఎందుకనేగా మీ డౌటానుమానం.. 

ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి పాట్ కమిన్స్ సుత్తె పట్టాడు. సుత్తె పట్టి గ్రౌండ్ లో గ్రౌండ్ మెన్ చేయాల్సిన పనిని అతడు చేశాడు. మట్టినంతా సుత్తెతో చదును చేశాడ. అదేంటి కమిన్స్ చేతిలో ఉండాల్సింది బంతి కదా.. బంతితో వికెట్లు తీయాల్సిన పని మానేసి మరి సుత్తె ఎందుకు పట్టాడు..? అనేగా మీ డౌటానుమానం. అక్కడికే వస్తున్నాం.. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న కరాచీలో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా కమిన్స్.. సుత్తె పట్టి మట్టిని చదును చేశాడు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ చేతికి బంతినిచ్చాడు కమిన్స్. 53వ ఓవర్ వేసిన గ్రీన్.. బంతిని వేసేప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాడు. అతడు బంతిని విసిరే సమయంలో ల్యాండ్ అవుతుండగా పిచ్ సరిగా లేదని గమనించాడు. 

దీంతో గ్రీన్ ఈ విషయాన్ని కమిన్స్ కు చెప్పాడు. కమిన్స్ ఈ విషయాన్ని అంపైర్లకు సూచించగా.. అక్కడికి ఓ గ్రౌండ్ మెన్ సుత్తెతో వచ్చాడు. అయితే అతడి దగ్గర్నుంచి సుత్తె తీసుకున్న కమిన్స్.. ఎగుడుదిగుడుగా ఉన్న ఏరియాను సరిచేశాడు. సుత్తె అందుకుని పిచ్ పై బాదుతూ మట్టిని తొలగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి కెమెరాల్లో రికార్డయ్యింది. 

Scroll to load tweet…

ఈ వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. కమిన్స్ సుత్తె పట్టి పిచ్ మీద బాదుతున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘కమిన్స్ నయా థోర్..?’ అని కామెంట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన పాక్ అభిమానులు సైతం కమిన్స్ ను ఎగతాళి చేశారు. 

ధీటుగా బదులిస్తున్న పాక్.. కెప్టెన్ సెంచరీ.. 

రెండో టెస్టులో భారీ లక్ష్యం (506 పరుగులు)తో బరిలోకి దిగిన పాకిస్థాన్.. ధీటుగా బదులిస్తోంది. భారీ ఛేదనలో 21 పరుగులకే పాక్ రెండు వికెట్లు కోల్పోయినా.. ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ (327 బంతుల్లో 152 నాటౌట్.. 16 ఫోర్లు) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (305 బంతుల్లో 96) తృటిలో సెంచరీ మిస్ చేసుకునన్నాడు. ప్రస్తుతం బాబర్ (152 నాటౌట్) తో కలిసి మహ్మద్ రిజ్వాన్ (20 బంతుల్లో 9 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుత ఆ జట్టు 125 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే పాక్ కు 217 పరుగులు కావాలి. ఆసీస్ కు ఆరు వికెట్లు కావాలి. ఇంకో సెషన్ ఆట మాత్రమే మిగిలుంది. ఆట కు ఇవాళే చివరిరోజు కావడంతో కరాచీ టెస్టు కూడా రావల్పిండి టెస్టు మాదిరే ఫలితం తేలకుండానే ముగియనుంది.