మెల్ బోర్న్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా టీం కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటివరకు కోహ్లీ బ్యాటింగ్, పిట్ నెస్, ఎనర్జీ ఆటను ఇష్టపడేవాడినని...కానీ ఇటీవల అతడు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో అమితమైన గౌరవం కూడా ఏర్పడిందన్నారు.  

''నేను చూసిన బెస్ట్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. అతడిని ఇష్టపడటానికి అనేక కారణాలున్నాయి. కానీ అతడంటే గౌరవం కలగడానికి తాజాగా తీసుకున్న నిర్ణయమే కారణం. తన భార్య అనుష్క గర్భవతిగా వుంది కాబట్టి ఈ సమయంలో ఆమె పక్కన వుండాలని అతడు అనుకుంటున్నాడు. కాబట్టే డెలివరీ సమయంలో ఇండియాలో వుండాలనుకుని తమ జట్టుతో(ఆస్ట్రేలియా)తో జరుగుతున్న సీరిస్ నుండి అర్దాంతరంగా తప్పుకుంటున్నాడు'' అని తెలిపారు. 

''పిల్లల పుట్టుకను మిస్ చేసుకోవద్దని నేను భావిస్తాను. తండ్రిగా మారే ఆ మధుర అనుభూతిని కోల్పోవద్దు. అలాగే ఇలాంటి సమయంలో భార్య దగ్గర వుండి ధైర్యాన్నివ్వాలి. ఆ పనే కోహ్లీ చెయ్యాలనుకుంటున్నాడు. ఈ నిర్ణయం వల్లే అతడంటే గౌరవం మరింత పెరిగింది'' అని లాంగర్ పేర్కొన్నాడు.