Shane Warne Eyes on Coaching Role: వరుస వైఫల్యాలతో కుదేలైన ఇంగ్లాండ్ జట్టుతో కలిసి.. తిరిగి  ఆ జట్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు  ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం  ఆసక్తిగా ఉన్నాడు.  

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఇంగ్లాండ్ కోచ్ గా మారనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి ఇంగ్లాండ్ క్రికెట్ వర్గాలు. టీమిండియాతో పాటు ఇటీవలే ముగిసిన యాషెస్ టెస్టు సిరీస్ లో దారుణ ఓటమిపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న ఇంగ్లాండ్.. ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ ను తొలగించిన విషయం తెలిసిందే. సిల్వర్ వుడ్ స్థానంలో ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ పాల్ కాలింగ్ వుడ్ ను తాత్కాలిక కోచ్ గా నియమించింది ఇంగ్లాండ్..

కానీ త్వరలోనే ఆ జట్టుకు పూర్తిస్థాయి హెడ్ కోచ్ ను నియమించేందుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యోచిస్తున్నది. ఇక ఇదే విషయమై తాజాగా షేన్ వార్న్ కూడా తన మనసులో మాట బయటపెట్టాడు. 

వార్న్ స్పందిస్తూ... ‘ఆ అవకాశమొస్తే నేను తప్పకుండా తీసుకుంటా. ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా ఉండటమనేది గొప్ప గౌరవం వంటిది. ఆ స్థానానికి నేను న్యాయం చేకూరుస్తానని నమ్ముతున్నాను. ఇంగ్లాండ్ జట్టులో మంచి ఆటగాళ్లున్నారు. అక్కడ చేయడానికి చాలా పని ఉంది. మీరు ఎంత మంచి ప్రదర్శనలు చేయాలన్నా మీకు మంచి ఆటగాళ్లు తప్పకుండా కావాలి.. ’ అని అన్నాడు.

Scroll to load tweet…

గత నెలలో ముగిసిన యాషెస్ సిరీస్ కు ముందు భారత్ తో టెస్టు సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ 2-1తో వెనుకబడింది. ఇక యాషెస్ లో ఆ జట్టు 4-0తో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సారథి జో రూట్, కోచ్ సిల్వర్ వుడ్ లపై వేటు వేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజాలు ఆరోపించారు. అయితే రూట్ సారథ్యంపై నమ్మకముంచిన ఈసీబీ.. కోచ్ పై మాత్రం వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే కాలింగ్ వుడ్ ను తాత్కాలిక కోచ్ గా ఈసీబీ నియమించగా.. ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో ఆ జట్టు టీ20 సిరీస్ ను కోల్పోయింది. కాగా.. వార్న్ గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు మెంటార్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడు ‘ది హండ్రెడ్’ లీగ్ తో లండన్ స్పిరిట్ కు కూడా మెంటార్ గా ఉన్నాడు. 

లాంగర్ విషయంపై స్పందిస్తూ.. 

ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్ తో పాటు యాషెస్ ను అందించిన ఆ జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ను ఆ బాధ్యతల నుంచి తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ విషయమై వార్న్ కూడా స్పందించాడు. వార్న్ మాట్లాడుతూ.. ‘లాంగర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా వ్యవహరించిన తీరు బాధాకరం. ఈ అంశాన్ని సీఏ సరిగా హ్యాండిల్ చేయలేదు. ఆసీస్ కు తొలి టీ20 ప్రపంచకప్ తో పాటు యాషెస్ ను భారీ తేడాతో అందించడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ పై మీరు వేటు వేస్తారా..? జట్టు భాగా రాణిస్తున్నప్పుడు అతడిని తొలగించాల్సిన పనేముంది..? మరి లాంగర్ కంటే బెస్ట్ క్యాండిడేట్ ను మీరు (సీఏ) చూపించండి..’ అని నిరాశ వ్యక్తం చేశాడు.