ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్  మూడేళ్ల తర్వాత టీ20ల్లో చోటు దక్కించుకున్నాడు. ట్యాంపరింగ్‌ కారణంగా ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌.. వరల్డ్‌కప్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. ఆపై ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో సైతం పూర్వపు ఫామ్‌తో సత్తాచాటాడు. కాగా, శ్రీలంక, పాకిస్తాన్‌లతో త్వరలో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు సంబంధించి స్మిత్‌ను ఎంపిక చేస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు ఆసీస్‌ తమ జట్టును ప్రకటించింది. 2016 మార్చిలో చివరిసారి ఆసీస్‌ తరఫున టీ20 మ్యాచ్‌ ఆడిన స్మిత్‌.. సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకున్నాడు. వచ్చే వరల్డ్‌ టీ20కి ఏడాది పాటు మాత్రమే సమయం ఉండటంతో ఆసీస్‌ తమ బలాన్ని పరీక్షించే పనిలో ఉంది.

అది కూడా తమ దేశంలోనే వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో ఆటగాళ్ల సత్తాకు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే టెస్టు స్పెషలిస్టు ఆటగాడైన స్మిత్‌ను పొట్టి ఫార్మాట్‌లో ఎంపిక చేశారు. మరొకవైపు యాషెస్‌లో దారుణంగా విఫలమైన ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు చోటు కల్పించారు. స్వదేశంలో అక్టోబర్‌ 27వ తేదీన శ్రీలంకతో తొలి టీ20 ఆరంభం కానుంది. లంకేయులతో టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత టాప్‌ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్‌తో ఆసీస్‌ తలపడనుంది. ఈ టీ20 సిరీస్‌లకు అరోన్‌ ఫించ్‌ ఆసీస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.