ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ లో ఆసిస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ఇంగ్లాండ్ అభిమానులు అతన్ని చీటర్ అంటూ అవమానించడం యావత్ క్రికెట్ ప్రియులకు  కలచివేసింది. స్మిత్ ను అలా అవమానించిన అభిమానులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇలా తమ ఆటగాళ్లను అవమానిస్తున్న ఇంగ్లాండ్ అభిమానులపై ఆస్ట్రేలియా ప్రధాని కూడా ఫైర్ అయ్యారు. కనీస మర్యాద, జాలి, క్రీడా స్పూర్తి లేకుండా గాయపడిన ఆటగాన్ని అవమానిస్తారా... అంటూ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ చురకలు అంటించాడు. మీ దేశానికి వచ్చిన అతిథులను గౌరవించే పద్దతి ఇదేనా అంటూ మారిసన్ ఇంగ్లాండ్ అభిమానులను కాస్త ఘాటుగానే విమర్శలు సందించాడు.

''సెకండ్ టెస్ట్ డ్రాగా ముగిసింది. కానీ ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ అభిమానులు వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరంగా వుంది. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ గాయపడిన సమయంలో వారు మరీ హీనంగా ప్రవర్తించారు. గాయాన్ని లెక్కచేయకుండా మళ్లీ బ్యాటింగ్ కు దిగిన అతడి క్రీడాస్పూర్తిని ప్రశంసించాల్సింది పోయి హేళనగా కామెంట్  చేశారు. మీ నుండి మేం ఏమీ కోరుకోవడం లేదు కేవలం మర్యాద తప్ప. 

స్మిత్ ఓ ఛాంపియన్. చాలాకాలంగా తన  అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడి ఆటతీరు పట్ల నేనెంతో గర్విస్తున్నాను. తనను అవమానిస్తు వారికి అతడు బ్యాట్ తోనే సమాదానం చెబుతాడని ఆశిస్తున్నా. మా జట్టు యాషెస్ సీరిస్ తోనే స్వదేశానికి తిరిగి  వస్తుందని పూర్తి నమ్మకంతో వున్నాను. అలాగే జరగాలని కోరుకుంటున్నాను.'' అంటూ మారిసన్ పేస్ బుక్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపర్చాడు.