ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్ లో అదరగొడుతున్న ఆసిస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి టెస్ట్ లో వరుస సెంచరీలతో చెలరేగి జట్టును గెలిపించిన స్టీవ్ స్మిత్ ప్రమాదానికి గురయ్యాడు. ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో అతడు బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ స్మిత్ రిటైర్డ్ హట్ గా మైదానాన్ని వీడాల్సివచ్చింది. 

యాషెస్ సీరిస్ లో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ లో కూడా స్టీవ్ స్మిత్ అదరగొట్టాడు. మొదటి టెస్ట్ లో మాదిరిగానే ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మరో సెంచరీ సాధించేలా కనిపించాడు. ఈ క్రమంలోనే అతడు ఆర్చర్ బౌలింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్మిత్ 80 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా  ఆర్చర్ వేసిన ఓ బంతి 145కిమీ వేగంతో వచ్చి మెడ బాగంలో బలంగా తాకింది. ఈ నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడిపోతూ అతడు మైదానంలోనే కుప్పకూలాడు. 

తీవ్రంగా గాయపడ్డ స్మిత్ రిటైర్డ్ హట్ గా వెనుదిరిగాడు. దీంతో మంచి ఫామ్ లో వున్న స్మిత్ ఎక్కడ జట్టుకు దూరమవుతాడేమోనన్న ఆందోళన ఆటగాళ్లలోనే కాదు ఆసిస్ అభిమానుల్లో కూడా మొదలయ్యింది. కానీ తర్వాత కాస్త కోలుకున్న స్మిత్ మళ్లీ  బ్యాటింగ్ కు దిగడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే మరో సెంచరీకి సాధించేలా కనిపించిన స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

 ఓవర్‌నైట్‌ స్కోరు 80/4తో ఆసిస్ శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించింది. ఇందులోనూ స్మిత్ ఒంటరి పోరాటంతో అదరగొట్టి జట్టు స్కోరును 250 పరుగులకు తీసుకెళ్లాడు. అయినప్పటి మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్(258 పరుగులు)కంటే 8 పరుగులు వెనుకబడింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 94/4 స్కోరు వద్ద నాలుగో రోజు ఆట ముగిసింది.  ప్రస్తుతం ఆసిస్ పై ఇంగ్లాండ్ 104 పరుగుల  ఆధిక్యంలో వుంది.