ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ తనను తాను శిక్షించుకున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో విఫలమైనందుకు మూడు కిలోమీటర్లు ఏకధాటిగా పరిగెత్తి తనకు తాను శిక్ష వేసుకున్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత స్మిత్ ఎక్కాల్సిన బస్సు వెళ్లిపోయింది. దీంతో అతను స్టేడియం నుంచి 3 కిలోమీటర్లు పరిగెత్తి హోటల్‌కు చేరుకున్నాడు.

దీనిపై స్టీవ్ స్పందిస్తూ... తాను ఏదైనా మ్యాచ్‌‌లో పరుగులు చేయకుంటే తనను తాను శిక్షించుకుంటానని... సెంచరీ చేస్తే చాక్లెట్ తీసుకుని తనను తాను అభినందించుకుంటానని తెలిపాడు. ఎప్పుడు మ్యాచ్‌లో విఫలమైనా పరిగెత్తడం లేదా జిమ్‌కు వెళ్లడం చేస్తానని, వీటితో పాటు అందుబాటులో వున్న శిక్షలను వేసుకుంటానని స్మిత్ వెల్లడించాడు.

Also Read:ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా జైత్రయాత్ర: టాప్-10లో నలుగురు ఆటగాళ్లు

కాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మిత్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి యాసిర్ షా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇదే మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 154, లబ్ షేన్ 185 పరుగులతో రాణించారు.

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో టెస్ట్ ఈ నెల 29 నుంచి అడిలైడ్‌లో జరగనుంది. కాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

మరోవైపు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌తో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాటింగ్ జాబితాలో నలుగురు భారత ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బ్యాట్స్‌మెన్ల జాబితాలో 928 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్ సందర్భంగా 136 పరుగులు చేయడంతో తన రేటింగ్ పాయింట్లను భారీగా పెంచుకున్నాడు. తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన కొత్త కుర్రాడు మయాంక్ అగర్వాల్ ఒక స్థానం ఎగబాకి 700 పాయింట్లతో 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

ఈ జాబితాలో ఛతేశ్వర్ పుజారా 791, అజింక్య రహానె 759, వరుసగా నాలుగు, ఐదో ర్యాంకుల్లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తన కెరీర్‌లో తొలిసారిగా టాప్-10లో అడుగుపెట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో అతను 91, 28 పరుగులు చేశాడు.

ఇక బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ 26వ స్థానంలో, లిటన్ దాస్ 78వ స్థానంలో నిలచాడు. ఇక బౌలర్ల జాబితాలో 716 పాయింట్లతో ఇషాంత్ శర్మ 17వ ర్యాంకులో నిలిచాడు. ఉమేశ్ యాదవ్ 672 పాయింట్లతో 21వ ర్యాంక్‌లో ఉన్నాడు.

Also Read:ధోనీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ఇదేనట..

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 9, బుమ్రా 5వ స్థానంలో నిలిచాడు. ఆల్ ‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 725 పాయింట్లతో ఒక స్థానం మెరుగై రెండో స్థానంలో ఉండగా.. అశ్విన్ ఐదో స్థానంలో ఉన్నాడు.