ఆస్ట్రేలియా యువ ఆటగాడు మార్నస్ లాబుస్చేన్‌ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్  సందర్భంగా ఇంగ్లీష్ బౌలర్ ఆర్చర్ వేసిన బంతి ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్ మెడకు బలంగా తగలడంతో స్మిత్ కుప్పకూలి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

40 నిమిషాల తర్వాత మరోసారి బ్యాటింగ్‌కు వచ్చిన అతను 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. గాయం మరింత బాధిస్తుండటంతో స్మిత్ రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు.

అతని స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆల్‌రౌండర్‌ మార్నస్ లాబుస్చేన్‌ను జట్టు మేనేజ్‌మెంట్ బరిలోకి దింపింది. ఐసీసీ సైతం లాబస్‌ తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా నమోదయ్యాడని ట్వీట్ చేసింది. 

కాంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే : ఒక క్రికెటర్ తలకు బంతి తగిలి రిటైర్డ్‌హర్ట్ అయినప్పుడు.. అతని స్థానంలో బరిలోకి దిగే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి చట్టంలో సవరణ చేసింది.