ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో మెకేల్ క్లార్క్ ఒకరు. ఇలా కేవలం జట్టు గెలుపుకోసం అతడు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయలేదు. దీంతో అతడు క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. 

కేవలం మ్యాచులు ఆడేటపుడే కాదు ప్రాక్టీస్ మ్యాచులు, నెట్ ప్రాక్టీస్ ఇలా క్రికెటర్లు ఎక్కువసమయం మైదానంలోనే గడుపుతుంటారు. క్లార్క్ వంటి ఆటగాళ్లు మరింత అత్యుత్తమంగా ఆడాలని ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం, ఇతర ఆటగాళ్లకు సలహాలు, సూచనలిస్తూ మరింత ఎక్కువగా మైదానంలో గడుపుతుంటారు. ఇదే అతడిపాలిట ఓ విధంగా వరం మరోరకంగా శాపమయ్యింది. 

అత్యధికంగా ఎండలో గడపడంతో క్లార్క్ చర్మ క్యాన్సర్ బారిన పడ్డాడు. 2015 రిటైర్మెంట్ కు ముందునుండే అతడు చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఇలా దాదాపు 13ఏళ్లుగా ఈ మహమ్మారితో పోరాడుతున్న అతడికి తాజాగా ఆపరేషన్ జరిగింది.  అతడి ముఖభాగం నుండి  ఓ క్యాన్సర్ కణితిని డాక్టర్లు  తొలగించారు. 

ఇలా ఆపరేషన్ తర్వాత నుదిటి భాగంలో కుట్లతో కూడిన ఫోటోను క్లార్క్ సోషల్ మీడియా మాద్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులకు ఓ ఆరోగ్య సలహా  కూడా ఇచ్చాడు. '' మరో రోజు...మరో క్యాన్సర్ కణితిని  నా ముఖం నుండి  తొలగించారు. యువకులూ... విపరీతమైన ఎండలు కాసే సమయంలో మీ ఆరోగ్యం జాగ్రత్త. మిమ్మల్ని మీరు కాపాడుకోడానికి ముందుగానే జాగ్రత్తపడండి. '' అంటూ క్లార్క్ ఇన్స్టాగ్రామ్ ద్వారా యువకులను  హెచ్చరించాడు.