INDvsAUS Indore Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గెలిచే అవకాశమైతే లేదు. ఆ జట్టుకు మిగిలింది సిరీస్ ఓటమి నుంచి కాపాడుకోవడమే..
భారత్ లో భారత్ ను ఓడించడం ఎలా..? ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియాకు ఇంకా సమాధానం దొరకలేదు. 19 ఏండ్లుగా ఇక్కడ సిరీస్ గెలవలేక నానా తంటాలు పడుతున్న ఆస్ట్రేలియా.. ఈసారైనా సిరీస్ ను చేజిక్కించుకునేందుకు అస్త్ర శస్త్రాలతో భారత్ కు వచ్చింది. ముగ్గురు స్పిన్నర్లతో ఆడించడం, సిరీస్ కు ముందు ప్రత్యేక స్పిన్ పిచ్ లు తయారుచేసుకుని ఆడటం, భారత యువ స్పిన్నర్లను అరువు తీసుకుని ప్రాక్టీస్ చేయడం.. ఎన్నిచేసినా తీరా మ్యాచ్ లోకి వెళ్లేసరికి ఆ జట్టుకు నిరాశే మిగిలింది.
నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులలో దారుణంగా ఓడిన ఆసీస్ ఇప్పటికే సిరీస్ గెలిచే అవకాశాలను కోల్పోయింది. ఇక ఆ జట్టుకు మిగిలింది సిరీస్ ను డ్రా చేసుకోవడమో లేక మరీ అవమానకర రీతిలో ఓడకపోవడమో.. అందుకు ఆస్ట్రేలియా గట్టిగానే ప్రిపేర్ అవుతున్నది.
ఇండోర్ టెస్టు కోసం ఆ జట్టు చేస్తున్న సాధన చూస్తేనే ఈ మ్యాచ్ లో తిరిగి పుంజుకోవడానికి ఆ జట్టు ఎంత తపన పడుతున్నదో అర్థమవుతున్నది. ముఖ్యంగా రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఫీల్డర్లు కీలక క్యాచ్ లను మిస్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి దానిని పునరావృతం కాకుండా ఉండేందుకు ఆ జట్టు సరికొత్త రీతిలో ప్రాక్టీస్ చేస్తున్నది. పిచ్ రోలర్, స్టీల్ డబ్బాలమీద కంగారూలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ బొర్వెక్ ఆధ్వర్యంలో స్మిత్, లబూషేన్, హ్యాండ్స్‌కాంబ్, తదితరులు ఈ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
మాములుగా పిచ్ ల మీద కంటే స్టీల్ డబ్బాలు, రోలర్ మీద పడ్డ బంతి మరింత మెలికలు తిరుగుతుంది. దీంతో దానిని అందుకోవడం కష్టం. స్మిత్ అండ్ కో. ఇప్పుడు దీనిపై కఠోర సాధన చేస్తున్నది. టర్నింగ్ పిచ్ లపై బంతి బ్యాట్ కు తాకాక ఎటు టర్న్ అవుతుందో ఈ ప్రాక్టీస్ సెషన్ ద్వారా ఆటగాళ్లకు ఓ అవగాహన వస్తుంది. ఇవేగాక బ్యాట్ తో కాకుండా బేస్ బాల్ ను ఉపయోగించి కూడా క్యాచ్ లు ప్రాక్టీస్ చేస్తున్నారు కంగారూలు. మరి ఈ ప్రాక్టీస్ ఆసీస్ కు మ్యాచ్ లో ఏ మేరకు ఉపయోగపడుతుందో తేలాలంటే మార్చి 1 వరకూ ఆగాల్సిందే. ఈ టెస్టుకు కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
