టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో 134 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. కెప్టెన్ టిమ్ పైన్ మరోసారి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో టిమ్ పైన్ రనౌట్‌ను నాటౌట్‌గా పేర్కొంటూ అంపైర్లు ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైంది. 55వ ఓవర్ ఆఖరి బంతికి అశ్విన్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. 

అయితే బంతి అందుకున్న రిషబ్ పంత్ వికెట్లను గిరాటేశాడు. ఈ రనౌట్‌పై నిర్ణయం ప్రకటించేందుకు చాలాసేపు సమయం తీసుకున్న థర్డ్ అంపైర్... బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్‌గా ప్రకటించాడు. ఇంతకుముందు వన్డే, టీ20 సిరీస్‌లో ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ సందర్భాల్లో ఆసీస్ బౌలర్లకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆసీస్‌కి అనుకూలంగా నిర్ణయం ప్రకటించాడు.

వికెట్లను గిరాటేసినప్పుడు బ్యాటు లైన్‌ మీద లేన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నా, అంపైర్ ఇలా నాటౌట్‌గా ప్రకటించడంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 

 

‘ఆ రనౌట్ రివ్యూ నుంచి టిమ్ పైన్ బయటపడడం చాలా ఆశ్యర్యంగా ఉంది. అసలు లైన్ బయట అతని బ్యాటు ఏ మాత్రం లేదు. నా ఉద్దేశంలో అతను అవుట్’ అంటూ ట్వీట్ చేశాడు షేన్ వార్న్. ఆసీస్ మాజీ క్రికెటర్ ఇలా ట్వీట్ చేశాడంటే, టీమిండియా ఫ్యాన్స్ ఊరుకుంటారా? థర్డ్ అంపైర్‌ను విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

వసీం జాఫర్ కూడా అంపైరింగ్‌ను ట్రోల్ చేస్తూ పోస్టు చేశాడు.