Asianet News TeluguAsianet News Telugu

కివీస్‌కి చుక్కలు చూపించిన ఆడమ్ జంపా... లో స్కోరింగ్ గేమ్‌లో ఆసీస్‌కి ఘన విజయం...

196  పరుగుల లక్ష్యఛేదనలో 82 పరుగులకే ఆలౌట్ అయిన న్యూజిలాండ్... రెండో వన్డేలో 113 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న ఆసీస్..

Australia beats New Zealand in 2nd ODI, Adam Zampa picks five, Starc all-round show
Author
First Published Sep 8, 2022, 5:32 PM IST

వన్డేల్లో 300+ స్కోరు కూడా తక్కువ అవుతున్న రోజులు ఇవి. అలాంటిది ఆస్ట్రేలియా 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. అది కూడా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఫైనల్‌లో తమతో తలబడిన న్యూజిలాండ్‌పై. అయితే కివీస్‌కి చుక్కలు చూపించిన ఆసీస్, 113 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది...

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ జట్టు, వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడి వన్డే సిరీస్‌ని 2-0 తేడాతో చేజార్చుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ఆసీస్‌కి బ్యాటింగ్ అప్పగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, పరుగులేమీ చేర్చకుండానే కెప్టెన్ ఆరోన్ ఫించ్ వికెట్ కోల్పోయింది...

మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ఫించ్ డకౌట్ అయ్యాడు. 2022లో 13 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఫించ్‌కి ఇది ఐదో డకౌట్. డేవిడ్ వార్నర్ 5, మార్నస్ లబుషేన్ 5 పరుగులు చేసి అవుట్ కాగా స్టోయినిస్ డకౌట్ కావడంతో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. 

అలెక్స్ క్యారీ  28 బంతుల్లో 12 పరుగులు చేయగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ 50 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సీన్ అబ్బాంట్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరగా స్టీవ్ స్మిత్ 94 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

117 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ రూపంలో 8వ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. అప్పటికి 36.3 ఓవర్లు మాత్రమే ముగిశాయి. మరో 14 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో ఆసీస్ ఆలౌట్ అవుతుందని అనుకున్నారంతా. అయితే సీనియర్లు మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్ కలిసి కివీస్ బౌలర్లకు షాక్ ఇచ్చారు. 21 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన ఆడమ్ జంపాతో 9వ వికెట్‌కి 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు మిచెట్ స్టార్క్..

148 పరుగుల వద్ద ఆడమ్ జంపా అవుట్ అయినా మిచెల్ స్టార్క్ 45 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు, జోష్ హజల్‌వుడ్ 16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ ఇద్దరూ 10వ వికెట్‌కి అజేయంగా 47 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం కూడా...

న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ 4, మ్యాట్ హెన్రీ 3, టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్ చెరో వికెట్ తీశారు. అయితే 196 పరుగుల లక్ష్యఛేదనలో మార్టిన్ గుప్టిల్ వికెట్‌ మొదటి ఓవర్‌లోనే కోల్పోయిన కివీస్, ఆ తర్వాత ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగలేదు... 33 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది న్యూజిలాండ్. 

మార్టిన్ గుప్టిల్ 2, డివాన్ కాన్వే 5 పరుగులు చేసి అవుట్ కాగా టామ్ లాథమ్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ కేన్ విలియంసన్ 58 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

డార్ల్ మిచెల్ 10, మైఖేల్ బ్రాస్‌వెల్ 12, జేమ్స్ నీశమ్ 2, టిమ్ సౌథీ 2, మ్యాట్ హెన్రీ 5 పరుగులు, ట్రెంట్ బౌల్ట్ 9 పరుగులు చేసి అవుట్ కాగా మిచెల్ సాంట్నర్ 29 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

కివీస్ ఇన్నింగ్స్‌ల్లో 5 ఫోర్లు మాత్రమే ఉండగా ఒక్క సిక్సర్ కూడా బాదలేకపోయారు న్యూజిలాండ్ బ్యాటర్లు. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా సీన్ అబ్బాట్ 5 ఓవర్లలో 4 మెయిడిన్లతో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు... ఆడమ్ జంపా 9 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. జంపాకి వన్డేల్లో ఇదే మొట్టమొదటి ఐదు వికెట్ల ప్రదర్శన. 

Follow Us:
Download App:
  • android
  • ios