Ashes 2021-22: యాషెస్ లో ఆసీస్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచి జోరుమీదున్న కంగారూలు.. అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టును కూడా గెలుచుకున్నారు. తద్వారా సిరీస్ లో 2-0 ఆధిక్యం సంపాదించారు.
యాషెస్ సిరీస్ లో భాగంగా అడిలైడ్ లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో విజయం కంగారూలనే వరించింది. ఆట ఐదో రోజైన సోమవారం.. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ పోరాడినా ఆ జట్టును పరాజయం నుంచి తప్పించలేకపోయారు. డే అండ్ నైట్ టెస్టు గా జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్.. ఇంగ్లాండ్ పై 275 పరుగుల భారీ తేడాతో గెలిచింది. తత్ఫలితంగా సిరీస్ లో 2-0 ఆధిక్యాన్ని పొందింది. తొలి ఇన్నింగ్సులో సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్సుల్ హాఫ్ సెంచరీ చేసిన ఆసీస్ ఆటగాడు మార్నస్ లబూషేన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
రెండో టెస్టు ఆఖరురోజైన సోమవారం ముందుగానే బెన్ స్టోక్స్ ను ఔట్ చేసి గెలుపు ఖాయం చేసుకున్న కంగారూలను వికెట్ కీపర్ జోస్ బట్లర్ (44), క్రిస్ వోక్స్ (44) ఆదుకున్నారు. ఇద్దరూ పట్టుదలతో ఆడి ఆసీస్ విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు. ఇద్దరూ కలిసి 8వ వికెట్ కు 51 పరుగులు జోడించారు. కానీ రిచర్డ్సన్ ఈ జోడీని విడదీశాడు. అతడి బౌలింగ్ లో వోక్స్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత టెయిలెండర్లతో కలిసి బట్లర్ కాసేపు ప్రతిఘటించాడు. కానీ...!!
పాపం బట్లర్...
రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి ఆదివారమే ఖాయమై పోయింది. నాలుగో రోజు చివరి బంతికి ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (24).. స్టార్క్ బౌలింగ్ లో వెనుదిరగడంతోనే ఆ జట్టుకు పరాజయం తప్పదనితేలిపోయింది. దానిని నిజం చేస్తూ.. బెన్ స్టోక్స్ (12) కూడా పెద్దగా రాణించకుండానే వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన బట్లర్.. సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ ను ఓటమి నుంచి గట్టెక్కించడానికి అతడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 207 బంతులాడాడు. అన్ని బంతులను ఎదుర్కొన్న బట్లర్ చేసింది 26 పరుగులే కావడం గమనార్హం. మరో ఎండ్ లో ఉన్న వోక్స్ అడపాదడపా బ్యాట్ ఝుళిపించినా.. బట్లర్ మాత్రం డిఫెన్స్ నే ఆశ్రయించాడు.
అయితే రిచర్డ్సన్ బౌలింగ్ లో వోక్స్ వెనుదిరిగినా.. బట్లర్ తన పోరాటం కొనసాగించాడు. రాబిన్సన్ (39 బంతుల్లో 8), స్టువర్ట్ బ్రాడ్ (31 బంతుల్లో 9) తో కలిసి చివరికంటా పోరాడాడు. బట్లర్ ను ఆసీస్ బౌలర్లు ఔట్ చేయకపోయినా అతడి అదృష్టం బట్లర్ ను వెక్కిరించింది. ఇన్నింగ్స్ 109 వ ఓవర్లో రిచర్డ్సన్ వేసిన ఆఖరు బంతికి హిట్ వికెట్ అయ్యాడు బట్లర్. దీంతో ఇంగ్లాండ్ అభిమానుల గుండె పగిలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్సన్ కు 5 వికెట్లు దక్కగా.. లియాన్ కు రెండు, స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
తాజా విజయంతో యాషెస్ సిరీస్ లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో కీలకమైన మూడో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు).. ఈనెల 26న మెల్బోర్న్ లో మొదలుకానున్నది.
సంక్షిప్త స్కోర్లు :
ఆస్ట్రేలియా : తొలి ఇన్నింగ్స్.. 473-9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్.. 230-9 డిక్లేర్డ్
ఇంగ్లాండ్ : తొలి ఇన్నింగ్స్ 236 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్ 192 ఆలౌట్
