Australia vs Pakistan: రెండు దశాబ్దాల అనంతరం పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. ఈ టూర్ ను విజయంతో ముగించింది. లాహోర్ లో జరిగిన ఏకైక టీ20లో ఆరోన్ ఫించ్ సేన.. పాక్ ను 3 వికెట్ల తేడాతో ఓడించింది.
రాక రాక పాకిస్తాన్ పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా జట్టు.. అసలు సిరీస్ జరుగుతుందా..? లేదా..? అని ఆటగాళ్లు, బోర్డుల మదిలో అనుమానాలు, ఆందోళనలు. గతానుభవాల దృష్ట్యా.. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఆసీస్ ఆటగాళ్లకు పటిష్ట భద్రత కలిగించింది పాక్ ప్రభుత్వం. ఆసీస్ ఆటగాళ్లు పాక్ గడ్డమీద అడుగుపెట్టగానే ఆ జట్టు ఆటగాడు ఆస్టిన్ అగర్ ను చంపుతామని బెదిరింపు లేఖ. టెస్టు సిరీస్ ప్రారంభం కాగానే ఇరు జట్లలో పలువురు ఆటగాళ్లకు కరోనా. అసలు ఈ సిరీస్ సజావుగా సాగేనా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. నెలన్నర పర్యటనను ఆసీస్ విజయవంతంగా ముగించింది. లాహోర్ లో ముగిసిన ఏకైక టీ 20ని గెలుచుకుని సిరీస్ ను గెలుపుతో శుభం కార్డు వేసింది. పాక్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మధ్యలో తడబడినా చివరికి గెలిచి సిరీస్ నిలబెట్టుకుంది.
లాహోర్ లోని గడాఫీ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఏకైక టీ20లో టాస్ గెలిచిన ఆసీస్.. పాక్ ను బ్యాటింగ్ రావాలని ఆహ్వానించింది. అయితే టీ20లో పాక్ కు విజయవంతమైన ఓపెనింగ్ జంటగా పేరున్న బాబర్ ఆజమ్ (46 బంతుల్లో 66), రిజ్వాన్ (19 బంతుల్లో 23) లు పాక్ కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ తొలి వికెట్ కు 67 పరుగులు జోడించారు.
రిజ్వాన్ నిష్క్రమించాక.. ఒక్క ఖుష్దిల్ (24) మినహా.. మరే ఇతర ఆటగాడు 20 పరుగులు కూడా చేయలేదు. ఫకర్ జమాన్ డకౌట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ (13) అసిఫ్ అలీ (3), హసన్ అలీ (10), షాహీన్ అఫ్రిది (0) లు విఫలమయ్యారు. ఫలితంగా పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎలిస్ నాలుగు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభమైంది. ట్రావిస్ హెడ్ (14 బంతుల్లో 26), ఆరోన్ ఫించ్ (45 బంతుల్లో 55) లు 3 ఓవర్లలోనే 40 పరుగులు జోడించారు. ట్రావిస్ ఔటైనా.. జోష్ ఇంగ్లిస్ (24), స్టాయినిస్ (23) సాయంతో ఫించ్ ఆసీస్ ను విజయం వైపు నడిపించాడు. అయితే ఫించ్ ను షాహీన్ అఫ్రిది ఔట్ చేయడం.. కామెరాన్ గ్రీన్ (2) కూడా త్వరగానే ఆసీస్ శిబిరంలో కాస్త అలజడి నెలకొంది.
కానీ బెన్ మెక్ డెర్మట్ (19 బంతుల్లో 22 నాటౌట్) లక్ష్యాన్ని పూర్తి చేసి ఆసీస్ కు విజయాన్ని అందించాడు. 19.1 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ వసీమ్ జూనియర్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.
1998 తర్వాత పాక్ పర్యటనకు వచ్చిన ఆసీస్.. మూడు మ్యాచుల టెస్టు సిరీస్ (రావల్పిండి, కరాచీ, లాహోర్) ను 1-0తో గెలుచుకుంది. తొలి రెండు టెస్టులలో ఫలితం రాలేదు. ఇక లాహోర్ వేదికగా ముగిసన వన్డే సిరీస్ ను పాక్ 2-1తో గెలిచింది. ఏకైక టీ20 మ్యాచులో ఆసీస్ ను విజయం వరించింది.
