Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ ఛాంపియన్లను చిత్తు చేసిన కంగారూలు.. తొలి వన్డేలో ఇంగ్లాండ్‌కు షాక్

AUS vs ENG: ఇటీవలే ముగిసిన టీ20 ప్రప్రంచకప్‌ ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి  టైటిల్ దక్కించుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు  ఆస్ట్రేలియా షాకిచ్చింది. ఈ టోర్నీ తర్వాత ఆ జట్టు ఆడిన తొలి మ్యాచ్ లోనే  ఓటమి పాలైంది. 

Australia Beat England by 6 Wickets in First  ODI
Author
First Published Nov 17, 2022, 5:19 PM IST

టీ20 ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న  ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా లో మెగా టోర్నీ ముగిశాక ఆడిన తొలి మ్యాచ్ లో పరాభవం పాలైంది.  కంగారూలతో జరిగిన తొలి వన్డేలో  ఇంగ్లాండ్ కు షాక్ తప్పలేదు. అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా.. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ఇంగ్లాండ్ నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా.. 46.5 ఓవర్లలో సాధించింది.  ఆసీస్ టాప్ -3 బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (86), ట్రావిస్ హెడ్ (69), స్టీవ్ స్మిత్ (80 నాటౌట్) లు రాణించి కంగారూలకు తొలి విజయాన్ని అందించారు. 

అడిలైడ్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది.  ఇంగ్లాండ్ ఓపెనర్లు జేసన్ రాయ్ (6), సాల్ట్ (14) లతో పాటు విన్స్ (5), బిల్లింగ్స్ (17) విఫలమయ్యారు. 

కానీ డేవిడ్ మలన్..  ఆసీస్ బౌలర్లను ఎదురొడ్డి నిలిచాడు.  128 బంతుల్లో 12 ఫోర్లు,  4 సిక్సర్ల సాయంతో  134 పరుగులు చేశాడు.   ఒకవైపు ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇబ్బందులు పడుతుంటే  మలన్ మాత్రం మెరుగ్గా ఆడాడు.  కెప్టెన్ జోస్ బట్లర్ (29, లియామ్ డాసన్ (11) లు కూడా విఫలమయ్యారు. చివర్లో డేవిడ్ విల్లీ (34) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా  50 ఓవర్లలో ఇంగ్లాండ్.. 9వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. 

 

అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా..  వీరవిహారం చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్,ట్రావిస్ హెడ్ లు తొలి వికెట్ కు ఏకంగా  147 పరుగులు జోడించారు. ఇద్దరూకలిసి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు.  20 ఓవర్లలోపే ఇంగ్లాండ్ స్కోరు 150 పరుగులు దాటింది. అయితే క్రిస్ జోర్డాన్.. 19.4 ఓవర్లో హెడ్ ను ఔట్ చేశాడు. అనంతరం సెంచరీ దిశగా సాగుతున్న వార్నర్ ను  విల్లీ  పెవిలియన్ కు చేర్చాడు.   అదే క్రమంలో మార్నస్ లబూషేన్ (4)  ను కూడా ఔట్ చేశాడు.  అలెక్స్ కేరీ  (21) విఫలమైనా.. కామెరూన్ గ్రీన్ (20నాటౌట్) తో కలిసి స్మిత్  కంగారూల విజయాన్ని పూర్తి చేశాడు. మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే ఆసీస్ గెలుపును అందుకుంది. ఈ విజయంతో ఆసీస్.. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios