Asianet News TeluguAsianet News Telugu

Ashes: ఇంగ్లాండ్ తో ‘బూడిద’ పోరులో ఆస్ట్రేలియా దళమిదే.. తొలి టీ20 ప్రపంచకప్ అందించిన హీరోలకు మొండిచేయి..

Australia Squad For Ashes: ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా ఆటగాళ్లు కొదమసింహాల్లా పోరాడే యాషెస్ సిరీస్ కోసం ఆ రెండు దేశాలే కాదు.. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. డిసెంబర్ 8 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ జరుగనున్నది.

Australia announce squad for The Ashes,T20 World Cup heroes Wade and Marsh dropped
Author
Hyderabad, First Published Nov 17, 2021, 1:45 PM IST

అయిదు వన్డే ప్రపంచకప్పులు  గెలిచినా.. టెస్టు క్రికెట్ లో ఆధిపత్యాన్ని చలాయించినా.. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ప్రపంచకప్ ను అందుకున్నా సగటు ఆస్ట్రేలియా అభిమాని ధ్యాసంతా యాషెస్ మీదే. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో ఆడాలని కోరుకోని ఆసీస్ ఆటగాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా ఆటగాళ్లు కొదమసింహాల్లా పోరాడే ఈ సిరీస్ కోసం ఆ రెండు దేశాలే కాదు.. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. 2019 లో యాషెస్ జరుగగా.. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా ‘బూడిద పోరు’ జరుగనున్నది. డిసెంబర్ 8 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. 

టిమ్ పైన్ కెప్టెన్ గా వ్యవహరించనున్న  కంగారూ సేనలో మొత్తం 15 మంది సభ్యులున్నారు. అయితే ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో అదరగొట్టి.. ఒకరకంగా ఆ జట్టు ఫైనల్ చేరి ఆపై తొలి పొట్టి కప్పు నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు కీలక ఆటగాళ్లకు మాత్రం బోర్డు మొండిచేయి చూపింది. టీ20 ప్రపంచకప్ లో  సెమీస్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ను గెలిపించిన  వికెట్ కీపర్ మాథ్యూ వేడ్.. ఫైనల్లో అదిరిపోయే ఆటతో మెరిసిన మిచెల్ మార్ష్ లకు జట్టులో చోటు దక్కలేదు. 

యాషెస్ సిరీస్ కు ఆసీస్ జట్టు: 

టిమ్ పైన్ (కెప్టెన్),  పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), కామెరూన్ గ్రీన్, మార్కస్ హ్యారిస్,  హెజిల్వుడ్,  ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, మైఖేల్ నేసర్, నాథన్ లైయన్, రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ 

 

తొలి రెండు టెస్టులకు మార్ష్, వేడ్ కు దక్కకున్నా  సీనియర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా మాత్రం తుది జట్టులోకి రావడం గమనార్హం. గత రెండేండ్లుగా దేశవాళీ క్రికెట్ లో అద్భుత ఫామ్ ను కనబరుస్తున్న కవాజాను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. ఇక మార్ష్ కు రెండు టెస్టులకు స్థానం దక్కకున్నా.. ఇంగ్లాండ్ తో ఆడబోయే ప్రాక్టీస్ మ్యాచ్ లకు అతడు ఆస్ట్రేలియా-ఎ తరఫున ఎంపికయ్యాడు. 

యాషెస్ షెడ్యూల్ : 

తొలి టెస్టు : డిసెంబర్ 8-12.. గబ్బా 
రెండో టెస్టు : డిసెంబర్ 16-20.. అడిలైడ్ ఓవల్ 
మూడో టెస్టు : డిసెంబర్ 26-30.. ఎంసీజీ.. (మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్)
నాలుగో టెస్టు : జనవరి 5-9.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ 
ఐదో టెస్టు : జనవరి 14-18..  పెర్త్ స్టేడియం 

యాషెస్ కు ఆ పేరు ఎలా వచ్చింది..? 

‘ప్రతి రెండేండ్ల కోసం ఆసీస్-ఇంగ్లాండ్ బూడిద కోసం కొట్టుకుంటాయి’ అని  పత్రికలలో కథనాలు చూసే ఉంటారు. అసలు  ఈ సిరీస్ కు ఆ పేరెలా వచ్చిందంటే.. 1882లో ఓవల్ స్టేడియంలో జరిగిన  ఓ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లీష్ జట్టు  అనూహ్యంగా ఓడింది. ఇంగ్లాండ్ పై ఆసీస్ కు ఇదే మొదటి విజయం. దీంతో ఓ ఆంగ్ల పత్రిక.. ఇంగ్లాండ్  క్రికెట్ చచ్చిపోయిందనే ఉద్దేశంతో ‘అంత్యక్రియలు జరుపగా వచ్చిన బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకెళ్తారు..’ అని ఓ సంచలనాత్మక కథనాన్ని రాసింది.  ఇక 1883లో ఇంగ్లాండ్ ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు పలు ఇంగ్లీష్ పేపర్లు.. ‘యాషెస్ ను తిరిగి తీసుకురండి..’ అని రాశాయి. అప్పట్నుంచి ఆసీస్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు ‘ది యాషెస్’ అనే పేరు స్థిరపడిపోయింది. 

ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 71 సార్లు యాషెస్ సిరీస్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా 33  సార్లు గెలువగా.. ఇంగ్లాండ్ 32 సార్లు  నెగ్గింది. ఆరు సిరీస్ లు డ్రా అయ్యాయి. 2019 లో జరిగిన యాషెస్ లో విజేత ఆస్ట్రేలియా. ఈ సిరీస్ లో ఇరు జట్ల ఆటగాళ్లు  బావోద్వేగాలు  ఆకాశాన్నంటుతాయి. 

ఇంగ్లాండ్ తో తలపడబోయే ఆసీస్-ఎ జట్టు : సీన్ అబోట్, ఆస్టన్ అగర్, స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, హెన్రీ హంట్, జోష్ ఇంగ్లిస్, నిక్ మాడిసన్, మిచెల్ మార్ష్, రెన్షా, మార్క్ స్టెకెట్,  బ్రైస్ స్ట్రీట్ 

Follow Us:
Download App:
  • android
  • ios