ఆస్ట్రేలియా కీలక ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌  మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మ్యాక్స్ వెల్ క్రికెట్ కి కొంతకాలం దూరం కావాలని భావిస్తున్నాడు. క్రికెట్‌ ఆ స్ట్రేలియా (సీఏ) ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 

‘ఆస్ట్రేలియా ఆటగాళ్ల మంచి చెడులు చూసుకోవడం మా బాధ్యత. మ్యాక్స్‌వెల్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా, అతని దేశవాళీ జట్టు విక్టోరియా కలిసి అతని ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకుంటాయి.మ్యాక్సీ మళ్లీ క్రికెట్‌లోకి అడుగు పెట్టే విధంగా తగిన వాతావరణం కల్పిస్తాం. ఈ సమయంలో మ్యాక్స్‌వెల్‌ వ్యక్తిగత జీవితాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టరాదని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అతనో ప్రత్యేకమైన ఆటగాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ కుటుంబంలో భాగమైన గ్లెన్‌ తొందరగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాం’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్‌ జనరల్‌ మేనేజర్‌ బెన్‌ ఒలీవర్‌ ప్రకటన జారీ చేశారు. 

గత కొంత కాలంగా మ్యాక్స్‌వెల్‌ మానసికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, దీనిని సరైన సమయంలో గుర్తించిన అతనికి విరామం తప్పనిసరి అని టీమ్‌ సైకాలజిస్ట్‌ మైకేల్‌ లాయిడ్‌ వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియా జట్టు సైకాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లాయిడ్ మాట్లాడుతూ, ‘మానసికంగా మ్యాక్స్ వెల్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగా కొంత కాలం పాటు క్రికెట్ కు అతను దూరమవుతున్నాడు. తనకున్న సమస్య ఏమిటో మ్యాక్స్ వెల్ కు తెలుసు. సపోర్టింగ్ స్టాఫ్ తో కూడా ఆయన అన్ని విషయాలను పంచుకుంటున్నాడు’ అని తెలిపారు.

మరోవైపు, శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో మ్యాక్స్ వెల్ 62 పరుగులు చేసి సత్తా చాటాడు. రెండో టీ20లో మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ కు దిగలేదు. శ్రీలంక నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని వార్నర్, స్టీవ్ స్మిత్ ఛేదించారు. ఈ కష్ట కాలంలో మ్యాక్స్ వెల్ కు, ఆయన కుటుంబానికి ఏకాంతతను కల్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరింది. త్వరలోనే మ్యాక్స్ వెల్ కోలుకుని, జట్టులోకి వస్తాడనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఆటగాళ్ల ఆరోగ్యానికి తాము అధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపింది.

మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం వన్డేలు, టీ-20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. అతను గతంలో టెస్టులు కూడా ఆడారు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి.