David Warner Trolls Pat Cummins: ఆస్ట్రేలియా జట్టు టెస్టు సారథి పాట్ కమిన్స్ ఇటీవలే ప్రముఖ షేవింగ్ బ్రాండ్ జిల్లెట్ కు సంబంధించిన యాడ్ లో నటించాడు. అయితే ఈ యాడ్ పై డేవిడ్ వార్నర్ అతడిని దారుణంగా ట్రోల్ చేశాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆసీస్ క్రికెటర్లలో ముందువరుసలో ఉంటాడు డేవిడ్ వార్నర్. కొత్తగా ఏ ట్రెండ్ వచ్చినా.. దానిని చేయడం, వైరల్ అవడం వార్నర్ కున్న ప్రత్యేకత. అయితే ట్రెండ్ ను ఫాలో అవడమే గాక క్రికెటర్లకు సంబంధించిన పోస్టుల పై కూడా వార్నర్ కామెంట్స్ చేస్తుంటాడు. వారి పోస్టులకు ఫన్నీ కామెంట్లు పెట్టి అభిమానులను అలరిస్తాడు. తాజాగా వార్నర్.. ఆసీస్ టెస్టు సారథి పాట్ కమిన్స్ ను దారుణంగా ట్రోల్ చేశాడు.
షేవింగ్ యాడ్ లో కమిన్స్.. న్యూజిలాండ్ నటుడు జులియన్ డేనిసన్ తో కలిసి నటించాడు. జిల్లెట్ కొత్త ఉత్పత్తి ProGlide 5 razor కు సంబంధించిన యాడ్ ఇటీవలే విడుదలైంది. ఆ వీడియోను కమిన్స్ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశాడు.
ఈ వీడియోను కమిన్స్ షేర్ చేస్తూ.. ‘జులియన్ డెనిసన్ నుంచి నేర్చుకుంటున్నా..’ అని రాసుకొచ్చాడు. అయితే ఈ వీడియోపై డేవిడ్ వార్నర్ కామెంట్ చేస్తూ.. ‘అసలు అక్కడ ఏముందని నువ్వు గడ్డం తీసుకుంటున్నావ్...?’ అని పేర్కొన్నాడు. ఇప్పుడు కమిన్స్ వీడియోతో పాటు డేవిడ్ వార్నరర్ కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నది. కమిన్స్ ఈ వీడియోను పోస్టు చేసిన కొద్దిసేపటికే పదివేల లైకులు, 500 కు పైగా కామెంట్లు వచ్చాయి.
కాగా ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు సారథి అయ్యాక కమిన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కొద్దిరోజుల క్రితం యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ను 4-0తో ఓడించిన కమిన్స్ సేన.. ఇటీవలే పాకిస్థాన్ తో ముగిసిన టెస్టు సిరీస్ ను 1-0తో గెలుచుకుంది. సారథిగా ఉన్నా కమిన్స్ మాత్రం తన బౌలింగ్ లో నిలకడ ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
ఇదిలాఉండగా ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ను గెలుచుకుని వన్డే సిరీస్ పై కన్నేసింది. రెండ్రోజుల క్రితం ముగిసిన తొలి వన్డేలో గెలిచిన ఆ జట్టు.. గురువారం జరిగిన రెండో వన్డేలో మాత్రం ఓటమిపాలైంది. లాహోర్ లో ముగిసిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసి 348 పరుగులు చేసినా పాకిస్థాన్.. మరో ఓవర్ మిగిలుండగానే విజయం సాధించింది. ఇదిలాఉండగా పాక్ తో వన్డే సిరీస్ లో భాగంగా లేని కమిన్స్.. ఐపీఎల్ లో ఆడేందుకు ముంబైకి చేరుకున్నాడు. అతడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కేకేఆర్ ట్విట్టర్ లో పంచుకుంది.
