Asianet News TeluguAsianet News Telugu

Ashes: సిరీసే కాదు.. ఆ ఘటనతో మనసులు కూడా గెలుచుకున్న పాట్ కమిన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Australia Vs England: యాషెస్ సిరీస్ గెలిచిన ఆనందంలో కంగారూ జట్టు ఆటగాళ్లంతా  షాంపైన్ తో వేదికమీద రచ్చ రచ్చ చేశారు. ఆ క్రమంలో ఆ జట్టులోని ముస్లిం సభ్యుడు వేదికకు దూరంగా వెళ్లడం చూసిన కమిన్స్... 
 

Aussie Skipper Pat Cummins Brilliant Gesture at Celebration Ceremony Wins Hearts In Social Media
Author
Hyderabad, First Published Jan 17, 2022, 11:09 AM IST

హోబర్ట్ వేదికగా ముగిసిన ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్లును 124 పరుగులకే పెవిలియన్ కు పంపి మూడు రోజుల్లోనే టెస్టును ముగించింది ఆసీస్.  ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ను 4-0తో ఓడించిన కంగారూల కొత్త సారథి పాట్ కమిన్స్.. సిరీస్ తో పాటు మనసులు కూడా గెలుచుకున్నాడు. ఇక ఆదివారం కమిన్స్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకున్నది. విజయంలో అందరూ భాగస్వాములే అని చెప్పకనే చెప్పిన  కమిన్స్  వ్యక్తిత్వానికి అందరూ ముగ్దులవుతున్నారు. ఆసీస్ సారథికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతన్నారు. 

ఇంతకీ కమిన్స్ ఏం చేశాడంటే.. యాషెస్ గెలిచిన తర్వాత విజేతకు కప్ అందించే కార్యక్రమం ముగిసింది. యాషెస్ గెలిచిన ఆనందంలో కంగారూ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేవు. షాంపైన్ లతో వేదికనంతా నింపేశారు. ఒకరిమీద ఒకరు షాంపైన్ చల్లుకున్నారు. ఇక కప్ తో ఫోటోలకు ఫోజులిచ్చే  క్రమంలో కూడా ఒకరి మీద ఒకరు షాంపైన్ పోసుకున్నారు. దీంతో ఆ జట్టు ఆటగాడు ఉస్మాన్ ఖవాజా.. వారి నుంచి దూరంగా వెళ్లి నిల్చున్నాడు. 

 

ముస్లిం అయిన ఖవాజా.. డ్రింక్ చేయడు. అంతేగాక అతడి మత సంప్రదాయంను అనుసరించి షాంపైన్ చల్లుకోవడానికి దూరంగా ఉన్నాడు. ఇది గమనించిన కమిన్స్..  వేదిక మీద ఉన్న టీమ్ మేట్ మార్నస్ లబూషేన్ చేతిలో ఉండే షాంపైన్ బాటిళ్లను  తీసుకున్నాడు. అది వెనకాల పెట్టేసి ఖవాజాను వేదిక మీదకు రమ్మని సూచించాడు.  కెప్టెన్ పిలుపుతో ఖవాజా కూడా హ్యాపీగా  వేదిక ఎక్కి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. 

ఖవాజా ఇబ్బంది పడటం చూసి గమనించి అసలు విషయం తెలసుకుని.. అతడిని కూడా వేడుకల్లో భాగం  చేశాడు కమిన్స్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. కమిన్స్ చేసిన ఈ పనికి క్రికెట్ అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నాలుగో టెస్టులో ఆడిన ఖవాజా.. ఆ టెస్టులో వరుసగా రెండు ఇన్నింగ్సులలో సెంచరీ చేయడం విశేషం.  

ఇక యాషెస్ సిరీస్ లో  వరుసగా తొలి మూడు టెస్టులు గెలిచిన ఆసీస్..హోబర్ట్ లో ముగిసిన ఐదో టెస్టును మూడు రోజుల్లోనే ముగించింది.   సిడ్నీలో జరిగిన నాలుగో టెస్టును ఇంగ్లాండ్ అతి కష్టమ్మీద డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఐదో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 303 పరుగులే చేసిన ఆసీస్.. ఇంగ్లాండ్ ను 188 పరుగులకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్సులో కమిన్స్ సేన 155 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లీష్ జట్టు 124 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఐదో టెస్టు కూడా కంగారూల వశమైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios