Asianet News TeluguAsianet News Telugu

కంగారు పడ్డా కంగారూలదే గెలుపు.. తొలి టీ20లో విండీస్ ఓటమి

AUS vs WI T20I: ఆస్ట్రేలియాలో మరికొద్దిరోజుల్లో జరుగబోయే ప్రపంచకప్ కు ముందు ఆ జట్టు వెస్టిండీస్ తో రెండు  మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతున్నది. తొలి మ్యాచ్ లో కంగారూలు లో స్కోరింగ్ థ్రిల్లర్ లో విజయాన్ని అందుకున్నారు. 

AUS vs WI: Australia beats West Indies By 3 Wickets in First T20I
Author
First Published Oct 5, 2022, 5:32 PM IST

టీ20 ప్రపంచకప్ కు ముందు  ఆస్ట్రేలియా-వెస్టిండీస్ లు ఆడుతున్న  రెండు మ్యాచ్ ల  టీ20 సిరీస్ లో భాగంగా క్వీన్స్ లాండ్ వేదికగా  ముగిసిన తొలి పోరులో  ఆస్ట్రేలియానే విజయం వరించింది. విండీస్ నిర్దేశించిన మోస్తారు లక్ష్యాన్ని  సాధించేందుకు ఆస్ట్రేలియా కష్టపపడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా.. 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో  ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (53 బంతుల్లో 58, 6 ఫోర్లు), వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (29 బంతుల్లో 39 నాటౌట్, 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి కంగారూలకు విజయాన్ని అందించారు. రెండు జట్ల మధ్య రెండో టీ20 ఈనెల 7న బ్రిస్బేన్ లో జరుగుతుంది. 

ఈ మ్యాచ్ లో టాస్  ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. బ్యాటింగ్ లో విఫలమైంది. ఆ జట్టు ఓపెనర్ కైల్ మేయర్స్ (36 బంతుల్లో 39, 5 ఫోర్లు, 1 సిక్సర్), ఓడియన్ స్మిత్ (27) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. 

తొలి ఓవర్ వేసిన  మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో  మేయర్స్ రెండు బౌండరీలు బాదాడు. కానీ హెజిల్వుడ్  తన తొలి ఓవర్ మొదటి బంతిక చార్ల్స్ (3) ను ఔట్ చేశాడు.  చార్ల్స్ ఔటైనా  మేయర్స్ బౌండరీలతో అలరించాడు. ఐదో ఓవర్లో హెజిల్వుడ్.. బ్రాండన్ కింగ్ (12) ను పెవిలియన్ కు పంపాడు. తొలి పవర్ ప్లేలో విండీస్.. 2 వికెట్ల  నష్టానికి 53 పరుగులు చేసింది.కానీ ఆ తర్వాత స్పిన్నర్ల రాకతో  విండీస్ పరుగుల వేగం నెమ్మదించింది. 

కమిన్స్ వేసిన పదో ఓవర్లో మేయర్స్ నిష్క్రమించిన తర్వాత విండీస్ క్రమం  తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ నికోలస్ పూరన్ (2), రీఫర్ (19), జేసన్ హెల్డర్ (13), పావెల్ (7), అల్జారి జోసెఫ్ (7)  లు విఫలమయ్యారు. చివర్లో ఒడియన్ స్మిత్ మెరుపులతో విండీస్ ఆ మాత్రం స్కోరైనా సాధించింది. 

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు ఆది నుంచే షాకులు తగిలాయి. మేయర్స్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన వార్నర్ (14) ఆ  తర్వాత కార్టెల్ బౌలింగ్ లో కూడా ఫోర్ కొట్టి రెండో బంతికి ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ (3) కూడా అదే ఓవర్లో పెవిలియన్ చేరాడు. ఇండియాతో సిరీస్ లో చెలరేగి ఆడిన కామెరూన్ గ్రీన్ (14) తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్ (0), టిమ్ డేవిడ్ (0)  కూడా అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరారు.  

58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను కెప్టెన్ ఆరోన్ ఫించ్, మాథ్యూ వేడ్ ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.  విండీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా నిలకడగా బ్యాటింగ్ చేశారు. అయితే  18వ ఓవర్లో తొలి బంతికి  ఫించ్ నిష్క్రమించాడు. అతడి స్థానంలో వచ్చిన కమిన్స్ (4) కూడా స్మిత్ తన 19వ ఓవర్లో నాలుగో బంతికి  బౌల్డ్ చేశాడు. దీంతో ఉత్కంఠ మొదలైంది.  చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమవగా.. తొలి బంతికి  వేడ్ ఫోర్ కొట్టాడు. రెండో బంతికి వేడ్ ఇచ్చిన క్యాచ్ ను  డీప్ పాయింట్ వద్ద రీఫర్ డ్రాప్ చేశాడు. తర్వాత బంతికి సింగిల్ వచ్చింది. నాలుగో బంతికి స్టార్క్ (6 నాటౌట్)  రెండు పరుగులు తీశాడు. ఐదో బంతికి కూడా డబుల్ తీయడంతో  ఆసీస్ విజయం పూర్తైంది. ఆసీస్ ఇన్నింగ్స్ తొలుత  చూపించిన జోరును విండీస్ బౌలర్లు మధ్యలో జారవిడవడంతో ఆ జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios