Australia Vs Pakistan: బౌలర్ బంతి విసిరాడు.  అది బ్యాటర్ ప్యాడ్లకు తాకింది.  అందరూ ఔట్ కోసం అప్పీల్ చేశారు. అంపైర్ ఔటివ్వలేదు. బౌలర్ డీఆర్ఎస్ కు వెళ్దామన్నాడు. కానీ వికెట్ కీపర్ మాత్రం బ్యాటర్ దగ్గరికెళ్లి... 

ఒక బ్యాటర్ ను పెవిలియన్ కు పంపే క్రమంలో బౌలర్ వేసిన బంతి ఎల్బీ అయితే అది ఔటా..? కాదా..? అని తెలుసుకోవడంలో వికెట్ కీపర్ ది ప్రధాన పాత్ర. డీఆర్ఎస్ తీసుకునే ముందు ఏ కెప్టెన్ అయినా వికెట్ల వెనుకాల ఉన్న వికెట్ కీపర్ మీదే ఆధారపడతాడు. కానీ ఆ కీపర్.. అది ఔటో కాదో తెలుసుకోవడానికి బ్యాటర్ అభిప్రాయమే కోరితే...? ఇదేం విచిత్రం అనుకుంటున్నారా..? అదే జరిగింది.. పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య కరాచీ వేదికగా జరుగుతునన్న రెండో టెస్టు దీనికి వేదికైంది. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. ఏకంగా బ్యాటర్ నే డీఆర్ఎస్ తీసుకోమంటావా..? లేదా... అని అడగడం విశేషం. 

వివరాల్లోకెళ్తే.. కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ లో భాగంగా.. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్ 70వ ఓవర్లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ చేతిలో బంతి. అతడు విసిరిన మూడో బంతి వచ్చి స్మిత్ ప్యాడ్ కు తాకింది. దీంతో అలీ తో పాటు అక్కడున్న వాళ్లంతా ఎల్బీకి అప్పీల్ చేశారు. 

కానీ అంపైర్ మాత్రం అందుకు స్పందించలేదు. దీంతో వెంటనే నౌమన్ అలీ అక్కడే స్లిప్స్ లో ఉన్న సారథి బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ వైపు చూస్తూ డీఆర్ఎస్ తీసుకుందామని కోరాడు. అయితే బంతి వికెట్ల ఎత్తు కంటే కొంత ఎక్కువ వెళ్తుందేమోనని అంచనా వేసిన వాళ్లిద్దరూ ఇద్దామా..? వద్దా..? అని బౌలర్ తో చర్చించారు. ఈ క్రమంలో రిజ్వాన్.. క్రీజులో నిల్చున్న స్మిత్ దగ్గరికెళ్లి అతడి భుజం మీద చేయి వేసి.. ‘బ్రో నువ్వు చెప్పు.. ఇది ఔటంటావా? కాదా..? డీఆర్ఎస్ కు వెళ్లమంటావా? వద్దా..?’ అని ఫన్నీగా అడిగాడు. 

Scroll to load tweet…

ఇది చూసిన బాబర్ ఆజమ్ తో పాటు అక్కడే ఉన్న అలీ, షాహీన్ అఫ్రిది, ఇతర పాక్ ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు విరభూశాయి. ఆఖరికి స్మిత్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఏదైతేనేం.. స్మిత్ తో చర్చించాక రిజ్వాన్ కూడా డీఆర్ఎస్ వద్దన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కరాచీ టెస్టులో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 118 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (339 బంతుల్లో 155 బ్యాటింగ్) తో పాటు ట్రావిస్ హెడ్ (15 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచులో స్టీవ్ స్మిత్.. 214 బంతుల్లో 72 పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. రావల్పిండిలో జరిగిన తొలి టెస్టు పేలవమైన డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే.