పాకిస్తాన్, టీమిండియా మధ్య మ్యాచ్ సమయంలో ప్రేక్షకులకు మధ్య వేలు చూపించిన గౌతమ్ గంభీర్... సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో...

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కి ఆవేశం చాలా ఎక్కువ. ఆవేశపరుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ అయినా మైదానంలో ఉన్నప్పుడు కాస్త ఆగి ఆలోచిస్తాడేమో కానీ గౌతమ్ గంభీర్‌కి అస్సలు కోపం ఆగదు. ఈ కారణంగానే మైదానంలో చాలా మంది ప్లేయర్లతో గొడవ పడ్డాడు గౌతీ..

ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నీకి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్, శ్రీలంకలో ఉన్నాడు. పల్లెకెలెలో పాకిస్తాన్, టీమిండియా మధ్య మ్యాచ్ సమయంలో గౌతమ్ గంభీర్, ప్రేక్షకులకు మధ్య వేలు చూపించిన వీడియో... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

<

Scroll to load tweet…

పిచ్ రిపోర్ట్ తర్వాత మీడియా రూమ్‌కి వెళ్తున్న సమయంలో గౌతమ్ గంభీర్‌ని చూసి, కొందరు ఫ్యాన్స్.. ఏదో అరిచారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గంభీర్, అతను అలా వేలు చూపించాడు. ఈ వీడియోని ఎడిట్ చేసిన ఓ పాక్ ఫ్యాన్, ‘కోహ్లీ... కోహ్లీ’ అంటూ అరుస్తున్న ఆడియోతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. 

ఈ సంఘటనపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. ‘క్రౌడ్ యాంటీ ఇండియా స్లోగన్స్ అరిచారు. ఓ ఇండియన్‌గా దాన్ని నేను సహించలేను. నా దేశం గురించి ఎవ్వరూ ఇలా మాట్లాడినా నేను ఇలాగే స్పందిస్తాను. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నది నిజం కాదు.. నేను ఎవరి ఫ్యాన్స్‌కి వ్యతిరేకిని కాదు.. కొందరు పాక్ ఫ్యాన్స్ ఇండియా గురించి, కశ్మీర్ గురించి అడ్డమైన వాగుడు వాగుతున్నారు. అలాంటి మాటలు విన్నప్పుడు నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్.. 

అయితే గౌతమ్ గంభీర్ వివరణ ఇవ్వడానికి ముందు జనాలు, కోహ్లీ... కోహ్లీ... అని అరవడం వల్లే గౌతీ ఇలా మధ్యవేలు చూపించాడని సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యింది. దీనికి కారణం లేకపోలేదు. ఐపీఎల్ 2013 సమయంలో విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్‌కి మధ్య గొడవైంది. ఈ సంఘటన జరిగి 10 ఏళ్లు దాటుతున్నా గంభీర్ మాత్రం దాన్ని మరిచిపోలేదు. 

2023 ఐపీఎల్ సమయంలో కూడా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మెంటర్‌గా వ్యవహరించాడు గంభీర్. బెంగళూరులో ఆర్‌సీబీతో మ్యాచ్‌ని ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది లక్నో సూపర్ జెయింట్స్.. ఈ విజయం తర్వాత ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ వైపు సైలెంట్‌గా ఉండాలంటూ వేలు చూపించాడు గౌతీ..

లక్నోలో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ దీన్ని తిరిగి ఇచ్చేశాడు. ఆర్‌సీబీ, లక్నో మధ్య మ్యాచ్‌లో నవీన్ వుల్ హక్‌తో విరాట్ కోహ్లీ గొడవ పడడం, మధ్యలో గౌతమ్ గంభీర్ రావడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడం జరిగిపోయాయి..

ఈ మ్యాచ్ చప్పగా సాగినా, మ్యాచ్ తర్వాత జరిగిన సీన్స్.. ఐపీఎల్ 2023 సీజన్‌‌కి కావాల్సినంత మసాలాని జోడించాయి. తన టీమ్‌ మేట్‌ని ఎవ్వరైనా ఏదైనా అంటే, తాను కచ్ఛితంగా అడ్డు వస్తానని కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్..

ఈ గొడవ కారణంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించిన ఐపీఎల్ మేనేజ్‌మెంట్, నవీన్ వుల్ హక్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించింది. ఐపీఎల్ 2024 సీజన్‌కి గౌతమ్ గంభీర్ అందుబాటులో ఉండడం లేదు. 2024 ఐపీఎల్ సమయంలో లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో ఢిల్లీ ఎంపీ, ఎన్నికల పనుల్లో బిజీ బిజీగా గడపబోతున్నాడు.