సారాంశం

38.4 ఓవర్లలో 193 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్.. 4 వికెట్లు తీసిన హారీస్ రౌఫ్... హాఫ్ సెంచరీలతో బంగ్లాని ఆదుకున్న ముస్తాఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా లాహోర్‌లో జరుగుతున్న మొదటి సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 38.4 ఓవర్లలో 193 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది..

గత మ్యాచ్‌లో భారీ సెంచరీతో అదరగొట్టిన మెహిదీ హసన్ మిరాజ్, నసీం షా బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ మొహమ్మద్ నయీం 25 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేయగా లిట్టన్ దాస్ 13 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేశాడు. 

తోహిడ్ హృదయ్ 9 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. ఈ దశలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ముస్తాఫికర్ రహీం కలిసి ఐదో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

వన్డేల్లో ఐదో వికెట్‌కి 100  పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం వీరికి ఇది ఐదోసారి. ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ - సురేష్ రైనా 6 సార్లు, ధోనీ  - యువరాజ్ సింగ్ 5 సార్లు శతాధిక భాగస్వామ్యాలు నెలకొల్పి ముస్తాఫికర్- షకీబ్ కంటే ముందున్నారు..


పాకిస్తాన్‌తో గత నాలుగు వన్డేల్లో షకీబ్- ముస్తాఫికర్ కలిసి 50+ భాగస్వామ్యం నమోదు చేయడం ఇది మూడోసారి. 57 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, ఫహీం ఆష్రఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.  

23 బంతుల్లో ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన షమీమ్ హుస్సేన్‌ని ఇఫ్తికర్ అహ్మద్ అవుట్ చేశాడు. 87 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేసిన ముస్తాఫికర్ రహీం, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికి టస్కిన్ అహ్మద్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

అతిఫ్ హుస్సేన్ 12, షోరిఫుల్ ఇస్లాం 1 పరుగు చేసి నసీం షా బౌలింగ్‌లో అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 38.4 ఓవర్లలో ముగిసింది. 

పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్ 6 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 5.4 ఓవర్లు వేసిన నసీం షా 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షాహీన్ ఆఫ్రిదీ, ఇఫ్తికర్ అహ్మద్‌, ఫహీం ఆష్రఫ్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.