Asia Cup 2023: శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ... 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా..
India vs Bangladesh: సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తున్న శుబ్‌మన్ గిల్.. టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్..
భారత యంగ్ సెన్సేషన్ శుబ్‌మన్ గిల్, మూడు నెలల బ్రేక్ తర్వాత మళ్లీ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో పాతుకుపోయిన శుబ్‌మన్ గిల్ సెంచరీతో టీమిండియాని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. 117 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ అందుకున్నాడు శుబ్‌మన్ గిల్. 32వ వన్డే ఆడుతున్న శుబ్‌మన్ గిల్‌కి ఇది ఐదో సెంచరీ..
266 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇన్నింగ్స్ రెండో బంతికి డకౌట్ అయ్యాడు. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న తెలుగుకుర్రాడు తిలక్ వర్మ, ఆరంగ్రేటం వన్డేలో ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన తిలక్ వర్మ, తంజీమ్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు..
17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కి 57 పరుగులు జోడించారు. 39 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మహెదీ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
ఇషాన్ కిషన్ 15 బంతుల్లో 5 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..
వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్, నేటి మ్యాచ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. 12 బంతుల్లో 7 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
170 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా. శుబ్‌మన్ గిల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ స్కోరు బోర్డును కదిలిస్తున్నాడు. 2023 ఏడాదిలో శుబ్‌మన్ గిల్‌కి ఇది నాలుగో వన్డే సెంచరీ. 2023 ఏడాదిలో 1500 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్, వన్డేల్లో 1000 పరుగులు అందుకున్నాడు.
2019 తర్వాత వన్డే ఫార్మాట్‌లో 1000 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. గత మూడేళ్లలో ఏ బ్యాటర్ కూడా వన్డే ఫార్మాట్‌లో 1000 పరుగులు చేయలేకపోయారు.