Asia Cup 2023: షకీబ్, హృదయ్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా ముందు మంచి టార్గెట్ పెట్టిన బంగ్లా...

నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసిన బంగ్లాదేశ్... 80 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, 54 పరుగులు చేసిన తోహిద్ హృదయ్... 

Asia Cup 2023: Shakib Al Hasan, Towhid Hridoy half centuries helped bangladesh vs India CRA

ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన బంగ్లాదేశ్, టీమిండియాతో మ్యాచ్‌లో మంచి పోరాటం చూపిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది..  టాపార్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయినా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 80 పరుగులతో పోరాడి, బంగ్లాకి మంచి స్కోరు అందించాడు.  తోహిద్ హృదయ్, నసుమ్ అహ్మద్ కూడా తమ వంతు సహకారం అందించారు...

లిట్టన్ దాస్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 12 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన తంజీద్ హసన్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 11 బంతుల్లో ఓ ఫోర్ బాదిన అనమోల్ హక్ కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు..

28 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ పట్టిన సూపర్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్.. ఈ క్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 200 క్యాచులు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ.  ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్ (334), విరాట్ కోహ్లీ (303), మహ్మద్ అజారుద్దీన్ (261), సచిన్ టెండూల్కర్ (256), 200+ అంతర్జాతీయ క్యాచులు అందుకున్న భారత ఫీల్డర్లుగా ఉన్నారు. 

ఈ దశలో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్, తోహిద్ హృదయ్ ఐదో వికెట్‌కి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత ఫీల్డర్లు చేతుల్లోకి వచ్చిన నాలుగు క్యాచ్‌లను జారవిడచడం బంగ్లా జట్టుకి బాగా కలిసి వచ్చింది..

85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బంతిని వికెట్ల మీదకి ఆడుకున్నాడు. 5 బంతుల్లో 1 పరుగు చేసిన షమీమ్ హుస్సేన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..

రవీంద్ర జడేజా కెరీర్‌లో ఇది 200వ వన్డే వికెట్. వన్డేల్లో 2 వేలకు పైగా పరుగులు, 200 వికెట్లు తీసిన రెండో భారత ఆల్‌రౌండర్‌గా నిలిచాడు రవీంద్ర జడేజా. ఇంతకుముందు కపిల్ దేవ్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు..

81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసిన తోహిద్ హృదయ్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్..

మహెదీ హసన్, నసుమ్ అహ్మద్ కలిసి 8వ వికెట్‌కి 6 ఓవర్లలో 45 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 45 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన నసుమ్ అహ్మద్‌ని ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ చేశాడు. 

ఆఖరి ఓవర్లలో తంజీమ్ హసన్ 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేయగా మహెదీ హసన్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా మహ్మద్ షమీ రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ తలా ఓ వికెట్ తీశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios