Asia Cup 2023: కొలంబోలో తగ్గని వర్షం... రిజర్వు డేలో కూడా ఆట సాగడం కష్టమే!...
మ్యాచ్ సమయానికి గంట ముందు కూడా జోరు వాన... 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైనా పూర్తి ఓవర్ల సాగనున్న మ్యాచ్..
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ సజావుగా సాగడం వరుణుడికి అస్సలు ఇష్టం లేనట్టుగా ఉంది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది. సూపర్ 4 రౌండ్‌లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కి రిజర్వు డే కేటాయించినా... ఫలితం తేలడం కష్టంగానే కనిపిస్తోంది..
సోమవారం కూడా కొలంబోలో భారీ వర్షం కురిసింది. మ్యాచ్ సమయానికి గంట ముందు కూడా జోరు వాన కురుస్తోంది. దీంతో వర్షం తగ్గినా ఆట షెడ్యూల్ సమయానికి (మధ్యాహ్నం 3 గంటలకు) ప్రారంభం కావడం కష్టమే.
ఆట 2 గంటలు ఆలస్యంగా ప్రారంభం అయినా పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్ జరిపించవచ్చు. ఇప్పటికే భారత జట్టు 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. ఇక మిగిలిన 25.5 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే, పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలవుతుంది. కాబట్టి వర్షం కారణంగా రెండు గంటల సమయం వేస్ట్ అయినా మ్యాచ్‌ని పూర్తి ఓవర్ల పాటు నిర్వహించే వీలుంది.
అయితే ఈ రోజు కొలంబోలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. దీంతో మ్యాచ్ ఫలితం తేలడం కాస్త కష్టమే. ఒకవేళ వర్షం కారణంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ రద్దు అయితే ఆ ప్రభావం భారత జట్టుపై తీవ్రంగా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక తొలి మ్యాచుల్లో బంగ్లాదేశ్‌పై భారీ విజయాలు అందుకున్నాయి..
ఈ మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ 3 పాయింట్లకు చేరుకుంటుంది. టీమిండియాకి ఒక్క పాయింట్ దక్కుతుంది. దీంతో చివరి రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. మిగిలిన రెండు మ్యాచులు కూడా కొలంబోలోనే ఆడనుంది టీమిండియా. శ్రీలంకతో మ్యాచ్ జరగాల్సింది రేపే (సెప్టెంబర్ 12). కాబట్టి రేపు కూడా వాతావరణం సహకరించకపోతే ఫలితం తేలడం కష్టమే..
ఆ తర్వాత సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 12న లంక మ్యాచ్ కూడా రద్దు అయితే టీమిండియా 2 పాయింట్లతో ఉంటుంది. పాకిస్తాన్, శ్రీలంక మూడేసి పాయింట్లకు చేరుకుంటాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 14న జరగాల్సిన మ్యాచ్ కీలకంగా మారుతుంది. వర్షంతో అది కూడా ఫలితం తేలకపోతే.. ఈ రెండు జట్లు నాలుగు పాయింట్లకు చేరుకుంటాయి. అప్పుడు టీమిండియా ఫైనల్ చేరాలంటే సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో మ్యాచ సజావుగా జరిగి, అందులో భారత జట్టు భారీ తేడాతో విజయం అందుకోవాల్సి ఉంటుంది..