కొలంబోలో భారీ వర్షం, మ్యాచ్ రద్దు అయ్యిందో... పాకిస్తాన్ ఇంటికే! ఫైనల్‌కి శ్రీలంక...
Asia Cup 2023: టీమిండియాతో ఆసియా కప్ 2023 ఫైనల్ ఆడే టీమ్‌ని డిసైడ్ చేయబోతున్న పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్.. వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు అయితే ఫైనల్ చేరనున్న శ్రీలంక..
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు కొలంబోలో పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ సూపర్ 4 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ రెండు జట్లకి ఇదే ఆఖరి మ్యాచ్. రెండు జట్లు కూడా బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతుల్లో ఓడిపోయాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు, సెప్టెంబర్ 17న టీమిండియాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌కి అర్హత సాధిస్తుంది..
ఈ మ్యాచ్‌కి రిజర్వు డే లేకపోవడంతో వర్షం తగ్గి సజావుగా మ్యాచ్ పూర్తి కాకపోతే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న శ్రీలంక, 3 పాయింట్లతో నేరుగా ఫైనల్ మ్యాచ్‌కి అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్ కూడా 3 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా ఫైనల్‌కి అర్హత సాధించలేదు..
టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు పాక్ ప్లేయర్లు గాయపడ్డారు. బౌలింగ్ చేస్తూ గాయపడిన నసీం షా స్థానంలో జమాన్ ఖాన్‌ని తీసుకున్నట్టు ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. రిజర్వు డే రోజున బౌలింగ్ చేయని హారీస్ రౌఫ్ మాత్రం పూర్తిగా కోలుకున్నా, నేటి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడం లేదు..
అలాగే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో గాయపడిన ఆఘా సల్మాన్ ప్లేస్‌లో సౌద్ షకీల్‌కి చోటు కల్పించింది పీసీబీ. అలాగే వరుసగా విఫలం అవుతున్న సీనియర్ ఓపెనర్ ఫకార్ జమాన్ ప్లేస్‌లో మహ్మద్ హారీస్‌కి తుది జట్టులో చోటు దక్కింది..
షాహీన్ ఆఫ్రిదీతో కలిసి మహ్మద్ వసీం జూనియర్, జమాన్ ఖాన్ కొత్త బంతిని పంచుకోబోతున్నారు. ఆసియా కప్ 2022 ఫైనల్‌లో పాకిస్తాన్‌ని ఓడించి, టైటిల్ గెలిచింది శ్రీలంక. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ ఎదురుచూస్తోంది.
ఈ రెండు జట్ల మధ్య శ్రీలంకలో వన్డే మ్యాచ్ జరిగి దాదాపు నాలుగేళ్ల కావస్తోంది. చివరిగా 2019లో లంకలో వన్డే సిరీస్ ఆడింది పాకిస్తాన్. ఆ సిరీస్‌లో పాకిస్తాన్, శ్రీలంకను వైట్ వాష్ చేసింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో పాకిస్తాన్, ఆ పొజిషన్‌ని కాపాడుకోవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సి ఉంటుంది..
ఆఫ్ఘానిస్తాన్‌పై సిరీస్ గెలిచి, ఐసీసీ నెం.1 వన్డే టీమ్‌గా నిలిచింది పాకిస్తాన్. అలాగే చిన్నాచితకా టీమ్స్‌పై ప్రతాపం చూపించి నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలిచాడు బాబర్ ఆజమ్. ఈ రెండు పొజిషన్లను కాపాడుకోవడానికి నేటి మ్యాచ్‌లో పర్ఫామెన్స్ చాలా కీలకం.
శ్రీలంకతో సూపర్ 4 మ్యాచ్‌కి పాకిస్తాన్ జట్టు ఇది: మహ్మద్ హారీస్, ఇమామ్ వుల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ ఆఫ్రిదీ, మహ్మద్ వసీం జూనియర్, జమాన్ ఖాన్