Asia Cup 2023: పాక్ జట్టులో లుకలుకలు, బాబర్ ఆజమ్ వర్సెస్ షాహిన్ ఆఫ్రిదీ
ఆసియా కప్ టోర్నమెంటులో ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైన పాకిస్తాన్ జట్టులో విభేదాలు పొడసూపాయి. శ్రీలంకపై మ్యాచులో ఓటమి పాలైన తర్వాత బాబర్ ఆజమ్ కు, షాహిన్ ఆఫ్రిదీకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఆసియా కప్ ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో లుకలుకలు ప్రారంభమయ్యాయి. జట్టు సభ్యులు రెండుగా విడిపోయారు. అది పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్, పేసర్ షాహిన్ షా ఆఫ్రిదీ మధ్య వైరంగా ముందకు వచ్చింది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకపై ఓటమి తర్వాత కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన ప్రసంగం పలువురిని ఆశ్చర్యపరిచింది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పొడసూపిన విభేదాలపై చానెల్ డాన్ కథనం ప్రకారం... ఓటమి తర్వాత డ్రెసింగ్ రూంలో బాబర్ ఆజమ్ ఆటగాళ్లపై నిప్పులు చెరిగాడు. ఆటగాళ్లు చెత్త ప్రదర్శన చేశారని ఆయన విరుచుకుపడ్డాడు. బాబర్ ఆజమ్ కు పేసర్ షాహిన్ ఆఫ్రిదీ అడ్డు తగిలాడు. ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను మెచ్చుకోవాలని షాహిన్ ఆఫ్రిదీ అన్నాడు. షాహిద్ ఆఫ్రిదీ మాటలను బాబర్ ఆజమ్ పట్టించుకోలేదు.
ఇరువురి మధ్య చెలరేగిన వివాదానికి అడ్డుకట్ట వేయడానికి మొహమ్మద్ రిజ్వాన్ జోక్యం చేసుకున్నాడు. నాటకీయంగా ఆసియా కప్ నుంచి వైదొలగడం వల్ల తలెత్తిన సమస్యకు తోడు బాబర్ ఆజమ్, షాహిన్ ఆఫ్రిదీ మధ్య చెలరేగిన వివాదం చెలరేగడంతో పాకిస్తాన్ క్రికెట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఓటమి తర్వాత జట్టుకు ఉన్న హోటల్ లోనూ పాకిస్తాన్ కు తిరిగి వచ్చే సమయంలోనూ బాబర్ ఆజమ్ తన జట్టు సభ్యులతో కలవలేదని, వారికి దూరంగా ఉన్నాడని తెలుస్తోంది. బంగ్లాదేశ్ మీద ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి సూపర్ 4లోకి అడుగు పెట్టిన పాకిస్తాన్ భారత్ మీద, శ్రీలంక మీద జరిగిన మ్యాచుల్లో ఓటమి పాలైంది.
ఆసియా కప్ నుంచి వైదొలిగిన తర్వాత షాహిన్ ఆఫ్రిదీ ఓ ట్వీట్ చేశాడు. తీవ్రమైన నిరాశకు గురి చేసిందని, కానీ ఇది అంతం కాదని ఆయన అన్నాడు. తాము వెనక్కి తగ్గబోమని, ఎల్లవేళలా పోరాటం సాగిస్తామని ఆయన ఆ ట్వీట్ లో అన్నాడు. పెద్ద సవాల్ తమకు ముందు ఉందని, దానికి తాము సిద్ధమవుతామని అన్నాడు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ముగించాడు.
ఆసియా కప్ టోర్నమెంటులో పాకిస్తాన్ తరఫున ఆడిన క్రికెటర్లలో షాదాబ్ ఖాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. నేపాల్ మీద జరిగిన మ్యాచులో నాలుగు వికెట్లు పడగొట్టినత షాదాబ్ ఆ తర్వాత పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. శ్రీలంకపై ఓటమితో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు. శ్రీలంకపై పాకిస్తాన్ విజయం సాధించాల్సి ఉండింది. అయితే, పాకిస్తాన్ విఫలమైంది.