Asia cup 2023: 2 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్... వరుణుడి రీఎంట్రీ! మళ్లీ ఆగిన ఆట..
India vs Pakistan: 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. ఇమామ్ వికెట్ తీసిన జస్ప్రిత్ బుమ్రా, బాబర్ ఆజమ్‌ని అవుట్ చేసిన హార్దిక్ పాండ్యా..
ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్- ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి మరోసారి అంతరాయం కలిగింది. వాన వల్ల ఆట నిలిచే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది పాకిస్తాన్. 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
24 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన బాబర్ ఆజమ్‌ని హార్ధిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. 43 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. ఓపెనర్ ఫకార్ జమాన్ 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 2 బంతుల్లో 1 పరుగు చేసి క్రీజులో ఉన్నారు..
మొదటి 11 ఓవర్లలోనే రెండు డీఆర్‌ఎస్ రివ్యూలను వాడేసింది భారత జట్టు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫకార్ జమాన్ వికెట్ కోసం రివ్యూ కోరింది టీమిండియా. అయితే టీవీ రిప్లైలో బంతి అవుట్ సైడ్ పిచ్ అవుతున్నట్టు కనిపించింది..
బాబర్ ఆజమ్ వికెట్ అవుటైన తర్వాతి బంతికే మహ్మద్ రిజ్వాన్ వికెట్ కోసం అప్పీలు చేసింది భారత జట్టు. అయితే టీవీ రిప్లైలో బంతి ఇంపాక్ట్ అవుట్‌సైడ్ లైన్‌గా కనిపించింది. దీంతో మొదటి 11 ఓవర్లలోనే రెండు రివ్యూలను కోల్పోయింది టీమిండియా..
డీఎల్‌ఎస్ విధానం ప్రకారం ఫలితం తేలాలంటే పాకిస్తాన్ కనీసం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలి. ఇప్పటికి పాక్ 11 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయడంతో వర్షం ఆగి, పాక్ తిరిగి కనీసం మరో 9 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం తప్పనిసరి. లేదంటే మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దు అవుతుంది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకి రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ అజేయ సెంచరీలతో 356 పరుగుల భారీ స్కోరు అందించారు. వర్షం కారణంగా నిన్న 24.1 ఓవర్ల వద్ద ఆగిన ఆట, నేడు గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. నేటి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేసిన భారత జట్టు, పాకిస్తాన్‌పై వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసింది.
వన్డేల్లో 47వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ కెరీర్‌లో 77 శతకాలు పూర్తి చేసుకున్నాడు. ఆగస్టు 2022లో 71వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, గత 13 నెలల్లో 7 సెంచరీలు చేశాడు. అందులో ఈ ఏడాది 5 సెంచరీలు చేశాడు. శుబ్‌మన్ గిల్ ఈ ఏడాది 5 అంతర్జాతీయ సెంచరీలు చేయడానికి 34 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే, విరాట్ కోహ్లీ 21 ఇన్నింగ్స్‌ల్లోనే 5 శతకాలు బాదేశాడు..