Asianet News TeluguAsianet News Telugu

పాక్‌ని ఆదుకున్న మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్.. ఫైనల్‌ చేరెదెవరో...

Asia Cup 2023: 86 పరుగులు చేసి పాకిస్తాన్‌ని ఆదుకున్న మహ్మద్ రిజ్వాన్.. ఇఫ్తికర్ అహ్మద్‌తో కలిసి ఆరో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం..

Asia Cup 2023: Mohammad Rizwan, Iftikhar Ahmed innings helped Pakistan vs Sri Lanka CRA
Author
First Published Sep 14, 2023, 9:26 PM IST

వర్షంతో బ్రేక్ వచ్చే సమయానికి 130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్, విరామం తర్వాత వీర లెవెల్లో చెలరేగిపోయింది. మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ కలిసి సెంచరీ భాగస్వామ్యంతో పాకిస్తాన్‌కి భారీ స్కోరు అందించారు. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్,  7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. 

11 బంతుల్లో 4 పరుగులు చేసిన ఫకార్ జమాన్, ప్రమోద్ మదుషాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. బాబర్ ఆజమ్, అబ్దుల్లా షెఫీక్ కలిసి రెండో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

35 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 69 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, పథిరాణా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

9 బంతుల్లో 3 పరుగులు చేసిన మహ్మద్ హారీస్, మతీశ పథిరాణా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్, మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది పాకిస్తాన్..

నవాజ్ అవుట్ కాగానే వర్షం కురవడంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. దాదాపు అరగంట విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. మహ్మద్ నవాజ్, ఇఫ్తికర్ అహ్మద్ కలిసి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.

ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కి 108 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన ఇఫ్తికర్ అహ్మద్, పథిరాణా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. షాదబ్ ఖాన్ 3 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మద్ రిజ్వాన్ 73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.. 

వర్షం బ్రేక్‌కి ముందు 27.4 ఓవర్లలో 130 పరుగులు చేసిన పాకిస్తాన్, విరామం తర్వాత 14.2 ఓవర్లలోనే 122 పరుగులు చేసింది. ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ కలిసి ఆరో వికెట్‌కి జోడించిన 108 పరుగులే, పాకిస్తాన్‌కి వన్డే ఆసియా కప్‌ చరిత్రలో ఆరో వికెట్‌కి అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 2008లో ఫవాద్ ఆలం- సోహైల్ తన్వీర్ కలిసి హంగ్‌కాంగ్‌పై 100 పరుగులు జోడించారు. 

నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు, సెప్టెంబర్ 17న టీమిండియాతో ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios