Asia Cup: ఈ ఏడాది భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు ముందు పాకిస్తాన్ ఆసియా కప్ కు ఆతిథ్యమిస్తున్నది. అయితే ఈ టోర్నీ జరుగుతుందా..? లేదా..? అనే గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది.
గత ఆరు నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైన ఆసియా కప్ నిర్వహణ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఈ టోర్నీని షెడ్యూల్ ప్రకారమే పాకిస్తాన్ లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ లో పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరుగుతుంది. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్ కు వెళ్లదు. పాక్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడదు. ఈ టోర్నీలో భారత్ ఆడబోయే మ్యాచ్ లను పాకిస్తాన్ లో కాకుండా తటస్థ వేదికల మీద ఆడించనున్నారు.
ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ, పీసీబీలు గత కొంతకాలంగా కత్తులు దూసుకుంటున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ లో ఆసియాకప్ ఆడేందుకు భారత్ వెళ్లబోదని, తటస్థ వేదిక అయితేనే ఆడతామని బీసీసీఐ సెక్రటరీ జై షా చేసిన వ్యాఖ్యలతో రేగిన దుమారం ఇన్నాళ్లు రగులుతూనే ఉంది.
ఎట్టకేలకు ఇరుదేశాల క్రికెట్ బోర్డులతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గురువారం దుబాయ్ లో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులతో పాటు పీసీబీ వాదనలూ వింది. మొదట్నుంచి చెబుతున్న మాటనే బీసీసీఐ మరోసారి తెలిపింది. తటస్థ వేదిక అయితే తప్ప ఈ టోర్నీలో ఆడబోమని తేల్చి చెప్పింది. పీసీబీ అందుకు అంగీకరించలేదు. దీంతో ఏసీసీ జోక్యం చేసుకుని ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించేందుకు ఆమోదం తెలుపుతూనే భారత్ ఆడబోయే మ్యాచ్ లను మాత్రం తటస్థ వేదికలపై నిర్వహించాలని సూచించింది. దీని ప్రకారం.. ఆసియా కప్ పాకిస్తాన్ లోనే జరుగుతుంది. కానీ ఈ లీగ్ లో భారత్ ఆడబోయే మ్యాచ్ లు మాత్రం మరో దేశంలో జరుగాయి. ఈ ప్రతిపాదనకు పీసీబీ కూడా అంగీకారం తెలిపింది. టోర్నీ మొత్తం పోయేదానికంటే కొన్ని మ్యాచ్ లను వేరే దేశంలో ఆడితే వచ్చే నష్టమేమీ లేదని ఆ దేశ బోర్డు భావిస్తున్నది.
అయితే భారత్ ఆడే మ్యాచ్ లకు తటస్థ వేదికలు ఏవి..? అన్నదానిమీద మాత్రం స్పష్టత లేదు. వీటికోసం యూఏఈ, ఓమన్, శ్రీలంక తో పాటు ఇంగ్లాండ్ కూడా ఆప్షన్లుగా ఉన్నాయి. శ్రీలంక, ఇంగ్లాండ్ లలో నిర్వహణ కొంచెం వ్యయంతో కూడుకున్నది. యూఏఈ అయితే పాక్ కు పొరుగున ఉండే దేశమే. దీంతో అక్కడే భారత్ మ్యాచ్ లు ఆడనున్నట్టు సమాచారం. అంటే ఈ లెక్కన లీగ్ దశ, సూపర్ సిక్స్ లలో భారత్ తో ఆడబోయే టీమ్ లు తటస్థ వేదికలమీదకే వెళ్లాలి. ఒకవేళ భారత్ ఫైనల్ కు చేరితే ఆ తుది పోరు కూడా తటస్థ వేదికమీదే జరుగుతుంది.
సెప్టెంబర్ లో జరుగబోయే ఈ మెగా టోర్నీ వన్డే ఫార్మాట్ లో జరుగుతుంది. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ లు ఇదివరకే అర్హత సాధించగా మరో జట్టు కోసం క్వాలిఫయింగ్ రౌండ్ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. భారత్, పాక్ గనక ఫైనల్ చేరితే 15 రోజుల్లోనే దాయాదుల మధ్య మూడు మ్యాచ్ లు జరుగుతాయి.
