Asia cup 2023: కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సెంచరీల మోత... పాకిస్తాన్‌పై భారీ స్కోరు చేసిన టీమిండియా..
Asia Cup 2023 India vs Pakistan: వన్డేల్లో 47వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ.. సెంచరీతో కమ్‌బ్యాక్ ఇచ్చిన కెఎల్ రాహుల్..
ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు భారత బ్యాటర్లు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో వచ్చిన కెఎల్ రాహుల్ సెంచరీలతో మోత మోగించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాకి భారీ స్కోరు అందించారు.
విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేయగా కెఎల్ రాహుల్ 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ 194 బంతుల్లో 233 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది టీమిండియా. వన్డేల్లో పాకిస్తాన్‌పై టీమిండియాకి ఇదే అత్యధిక స్కోరు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత మొదటి మ్యాచ్ ఆడుతున్న కెఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో కెఎల్ రాహుల్‌కి ఇది ఆరో సెంచరీ.. విరాట్ కోహ్లీ వన్డేల్లో 47వ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. 24.1 ఓవర్లలో 147/2 స్కోరుతో రిజర్వు డే ఆటని కొనసాగించిన భారత బ్యాటర్లు రాహుల్, కోహ్లీ.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించింది..
2023 ఏడాదిలో 1000 అంతర్జాతీయ పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఓవరాల్‌గా ఒకే ఏడాదిలో వెయ్యికి పైగా అంతర్జాతీయ పరుగులు చేయడం విరాట్ కోహ్లీకి ఇది 12వ సారి. సచిన్ టెండూల్కర్ 16 సార్లు ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉన్నాడు..
రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీ 11 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఓవరాల్‌గా కుమార సంగర్కర 15 సార్లు, జాక్వస్ కలీస్ 14, కుమార జయవర్థనే 14, రికీ పాంటింగ్ 13 సార్లు వెయ్యికి పైగా పరుగులు చేసి విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు..
పాక్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు 20+ పరుగులు కూడా చేయలేకపోయారు. అయితే నేటి మ్యాచ్‌లో రోహిత్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ 50+ స్కోర్లు అందుకున్నారు. పాకిస్తాన్‌పై వన్డేలో టాప్ 4 బ్యాటర్లు 50+ స్కోర్లు చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2017లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ హాఫ్ సెంచరీలు చేశారు.
పాకిస్తాన్‌పై వన్డేల్లో 300+ స్కోరు చేయడం టీమిండియాకి ఇది 16వ సారి. ఇంగ్లాండ్ 13 సార్లు, ఆస్ట్రేలియా 12 సార్లు పాక్‌పై 300+ స్కోర్లు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది 112వ 50+ స్కోర్లు. సచిన్ టెండూల్కర్ 145, కుమార సంగర్కర 118 సార్లు వన్డేల్లో 50+ స్కోర్లు చేసి విరాట్ కంటే ముందున్నారు.
వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, వన్ డౌన్‌లో 14 వేల పరుగులు అందుకున్నాడు. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ దంచుడు కారణంగా షాహీన్ షా ఆఫ్రిదీ 10 ఓవర్లలో 79 పరుగులు సమర్పించాడు. ఓ మెయిడిన్ వేసిన షాదబ్ ఖాన్ కూడా 10 ఓవర్లలో 71 పరుగులు ఇచ్చాడు.
భారత బ్యాటర్ల బాదుడుకి నసీం షా కూడా గాయంతో పెవిలియన్ చేరాడు. దీంతో పార్ట్ టైం బౌలర్ ఇఫ్తికర్ అహ్మద్ 5.2 ఓవర్లలో 52 పరుగులు సమర్పించాడు. ఫహీం ఆఫ్రఫ్ 10 ఓవర్లలో 74 పరుగులు సమర్పించాడు.