Asianet News TeluguAsianet News Telugu

Asia Cup 2023: కెఎల్ రాహుల్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా! శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ..

Asia Cup 2023: 74 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. 

Asia Cup 2023: KL Rahul, Rohit Sharma, Tilak Varma goes early, Team India lost 3 early wickets CRA
Author
First Published Sep 15, 2023, 8:41 PM IST

ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా, మూడో వికెట్ కోల్పోయింది. మూడో వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కెఎల్ రాహుల్, మహెదీ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 74 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు..

266 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇన్నింగ్స్ రెండో బంతికి డకౌట్ అయ్యాడు. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్‌ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న తెలుగుకుర్రాడు తిలక్ వర్మ, ఆరంగ్రేటం వన్డేలో ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన తిలక్ వర్మ, తంజీమ్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు..

17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కి 57 పరుగులు జోడించారు. 39 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మహెదీ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ 61 బంతుల్లో 6 ఫోర్లు ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. శుబ్‌మన్ గిల్‌కి ఇది వన్డేల్లో 9వ హాఫ్ సెంచరీ. శుబ్‌మన్ గిల్‌తో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా ఈ నలుగురు చేసే పరుగులపైనే టీమిండియా విజయం ఆధారపడి ఉంది. 

ఆసియా కప్ చరిత్రలో మూడు సార్లు డకౌట్ అయిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా రెండేసి సార్లు డకౌట్ అయ్యారు..

ఆసియా కప్ చరిత్రలో డకౌట్ అయిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు 1988 ఆసియా కప్ ఎడిషన్‌లో దిలీప్ వెంగ్‌సర్కార్ డకౌట్ అయ్యాడు..

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 29వ డకౌట్. టాపార్డర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. సచిన్ టెండూల్కర్ 34, విరాట్ కోహ్లీ 33, వీరేంద్ర సెహ్వాగ్ 31 సార్లు డకౌట్ అయి, రోహిత్ కంటే ముందున్నారు..

అలాగే ఆసియా కప్‌లో రెండు సార్లు డకౌట్ అయిన భారత ఓపెనర్ కూడా రోహిత్ శర్మనే. ఇంతకుముందు ఏ భారత ఓపెనర్ కూడా రెండు సార్లు డకౌట్ కాలేదు..

Follow Us:
Download App:
  • android
  • ios