ఎంతకీ తగ్గని వర్షం..  ఫలితం తేలకుండానే రద్దు అయిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్... 3 పాయింట్లతో సూపర్ 4 స్టేజీకి పాకిస్తాన్... 

ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత జోరు వాన కురవడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలవ్వలేదు. వర్షం కాసేపు తగ్గినా తిరిగి ప్రారంభించాలని అనుకునేలోపు మళ్లీ చినుకులు పడ్డాయి. వర్షం తగ్గుతుందని 9 గంటల 54 నిమిషాల వరకూ ఎదురుచూసిన అంపైర్లు, వరుణుడు ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్లకి చెరో పాయింట్ దక్కింది.

తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 238 పరుగుల తేడాతో భారీ విజయం దక్కించుకున్న పాకిస్తాన్, సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించింది. టీమిండియా, సెప్టెంబర్ 4న నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సూపర్ 4 రౌండ్‌కి చేరుకుంటుంది. లేదా వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయినా టీమిండియా సూపర్ 4 స్టేజీకి చేరుకుంటుంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాని ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా కలిసి ఆదుకున్నారు. చివర్లో జస్ప్రిత్ బుమ్రా కూడా 16 పరుగులు చేయడంతో టీమిండియా... ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి ఐదో ఓవర్‌లో తొలి షాక్ తగిలింది. వర్షం కారణంగా కాసేపు అంతరాయం కలిగి, ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 22 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన రోహిత్ శర్మను షాహీన్ ఆఫ్రిదీ క్లీన్ బౌల్డ్ చేశాడు..

వస్తూనే ఫోర్ బాది ఖాతా తెరిచిన విరాట్ కోహ్లీ కూడా షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. 5 నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్, 2 ఫోర్లు బాది మంచి టచ్‌లో ఉన్నట్టు కనిపించాడు.

9 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఫుల్ షాట్ ఆడబోయి ఫకార్ జమాన్‌కి ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 32 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా హారీస్ రౌఫ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 

66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. ఈ దశలో ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా కలిసి టీమిండియాని ఆదుకున్నారు. 53 బంతుల్లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వన్డేల్లో ఇషాన్ కిషన్‌కి ఇది ఏడో హాఫ్ సెంచరీ కాగా మిడిల్ ఆర్డర్‌లో మొట్టమొదటిది. ఇంతకుముందు ఇషాన్ కిషన్ చేసిన 6 వన్డే హాఫ్ సెంచరీలు కూడా ఓపెనర్‌గా చేసినవే.. 

82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు బాదిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2008 ఆసియా కప్‌లో ధోనీ 76 పరుగులు చేయడమే ఆసియా కప్‌లో భారత వికెట్ కీపర్‌కి అత్యధిక స్కోరు.. 

62 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు హార్ధిక్ పాండ్యా. వన్డేల్లో హార్ధిక్ పాండ్యాకి ఇది 11వ హాఫ్ సెంచరీ.. హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ కలిసి ఐదో వికెట్‌కి 138 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాని ఆదుకున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఐదో వికెట్‌కి టీమిండియా తరుపున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.

81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో 3 ఫోర్లు బాదిన హార్ధిక్ పాండ్యా, 12 పరుగులు రాబట్టాడు. 90 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 87 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అఘా సల్మాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

హార్ధిక్ పాండ్యా అవుటైన ఓవర్‌లోనే రవీంద్ర జడేజాని పెవిలియన్ చేర్చాడు షాహీన్ ఆఫ్రిదీ. 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రవీంద్ర జడేజా. శార్దలూ్ ఠాకూర్ 3 పరుగులు చేసి నసీం షా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

242 పరుగులకే 8 వికెట్ కోల్పోయింది టీమిండియా. ఈ దశలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ కలిసి 9 వ వికెట్‌కి 19 పరుగులు జోడించారు. 13 బంతుల్లో 4 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్, నసీం షా బౌలింగ్‌లో రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
 14 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా, నసీం షా బౌలింగ్‌లో సిక్సర్‌కి ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

పాక్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిదీకి 4 వికెట్లు దక్కగా హారీస్ రౌఫ్ 3 వికెట్లు తీశాడు. నసీం షాకి 3 వికెట్లు దక్కాయి.